
మన తెలంగాణ/హైదరాబాద్ : భవిష్యత్ తెలంగాణకు వరంగల్,కరీంనగర్, ఖమ్మం కారిడార్ చాలా కీలకమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి బోధి పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్‌పైన బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సిఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి,ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్‌ను డిఫెన్స్ ఆధ్వర్యం లో ఏర్పాటు కాబోతుందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, రోడ్స్, ఎస్‌టిపి లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి,ఈవీ వంటి అంశాల పైన ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు.ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్‌లకి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేయాలని, అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సూచించారు. రాబోయే ఎయిర్ పోర్టులను దృష్టి లో ఉంచుకొని రోడ్‌లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలన్నారు. లీజ్‌కు తీసుకునే వాహనాలు కూడా ఈవీ వే ఉండాలని సూచించారు. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఉండాలన్నారు. అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లు అర్బన్ ప్లానింగ్ లో తప్పని సరిగా ఉండాలన్నారు. మున్సిపాలిటీలలో సోలార్ ఎనర్జీ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని, పట్టణాలు ,నగరాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి చోట స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని, ఆయా నగరాలు,పట్టణాల జనాభా తగినట్లు స్థానికం గా డిజైన్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ పైన ఏఐ వినియోగంపైన సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు.
సీవరేజ్ అండ్ వేస్ట్ వాటర్ మానేజ్మెంట్ బోర్డు నుంచి శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో వాడేలా నిబంధన పెట్టాలని సూచించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు కావాల్సిన నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సింగరేణి పరిధి లో ఉన్న అన్ని మున్సిపాలిటీ లను ఒక యూనిట్ గా చేయాలన్నారు. సింగరేణి సంస్థ సిఎస్‌ఆర్ నిధులను స్థానికం గానే ఖర్చు చేయాలని సూచించారు. నల్గొండ,యాదగిరి గుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు, ఆదిలాబాద్, నాగోబా ,బాసర,కడెం ప్రాజెక్ట్ లను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు.కృష్ణా పుష్కరాలను దృష్టి లో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. మహబూబ్ నగర్,భూత్పూర్,జడ్చర్ల లను కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని, కొత్తగూడం,పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ ఏర్పాటు, రేడియల్ రోడ్లు పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో ఉండేలా డిజైన్ చేయాలని, వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రతిదీ డిజైన్ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.














