ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ నెం. 918 జారీ చేసింది.
ప్రస్తుతం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శశిభూషణ్ కుమార్‌కు జలవనరుల శాఖ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆయనకు మరో కీలక శాఖ అదనంగా చేరింది.
ఇప్పటివరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం విముక్తి కల్పించింది.
అదేవిధంగా పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ బదిలీలు, అదనపు బాధ్యతల ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.














