భగ్గుమంటున్న ఎండలు... హీట్‌వేవ్ భయం... ఆకాశాన్నంటుతున్న విమాన ఛార్జీలు... ఇవన్నీ కలిసి విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.
వీఎంఆర్డీఏ అధికారుల ప్రకారం టీయూ-142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం, ఐఎన్‌ఎస్ కురుసురా సబ్‌మరైన్ మ్యూజియం, కైలాసగిరి వంటి పర్యాటక ప్రాంతాల్లో గత ఏడాదితో పోలిస్తే సందర్శకుల సంఖ్య భారీగా తగ్గింది.
ఇక ఏఎస్ఆర్ జిల్లాలోని బొర్రా గుహలు పరిస్థితి కూడా ఇదే. గత ఏడాది రోజుకు 5 వేల మందికి పైగా సందర్శకులు వచ్చేవారని, ఇప్పుడు కేవలం 400 మంది మాత్రమే వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
పర్యాటకుల రాక తగ్గిపోవడంతో స్థానిక వ్యాపారులు, ఫుడ్ వెండర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగం కూడా తీవ్రంగా నష్టపోతున్నట్లు టూర్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


















