అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ వృత్తికి గౌరవం తీసుకువచ్చారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. జీజీహెచ్‌లో 80 శాతానికి పైగా రోగుల సంతృప్తి నమోదవడానికి నర్సుల సేవలే కారణమన్నారు. ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, హాస్టల్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఫ్లోరెన్స్ నైటింగేల్ చూపిన సేవా మార్గం నేటికీ నర్సింగ్ వృత్తికి స్ఫూర్తిగా నిలుస్తోందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు అన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ.. జీజీహెచ్‌లో రోగుల రద్దీ అధికంగా ఉండటం సేవల నాణ్యతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన 35 మందిని సన్మానించారు.