దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి తర్వాత డిజిటల్, ఫైనాన్షియల్ గోల్డ్ పెట్టుబడులపై చర్చ మళ్లీ మొదలైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం కొనుగోళ్లు పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. కానీ ఆభరణాలు, నాణేలు, బిస్కెట్ల రూపంలో కాకుండా గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అంటే ఈజీఆర్‌లు, మల్టీ అసెట్ ఫండ్ల వంటి మార్గాలను ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దీంతో దేశానికి బంగారం దిగుమతి భారం తగ్గడంతో పాటు పెట్టుబడిదారులకు కూడా భద్రత, పారదర్శకత, సులభ లిక్విడిటీ లభిస్తాయని చెబుతున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లను డీమ్యాట్ ఖాతా ద్వారా షేర్ల మాదిరిగా కొనుగోలు చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే తయారీ చార్జీలు, లాకర్ ఖర్చులు, స్వచ్ఛత సమస్యలు ఉండవు. ఇక సెబీ ప్రవేశపెట్టిన ఈజీఆర్‌ల ద్వారా వాల్ట్‌లలో ఉన్న నిజమైన బంగారానికి డిజిటల్ రసీదులు జారీ చేస్తారు. అవసరమైతే వాటిని భవిష్యత్తులో నిజమైన బంగారంగా మార్చుకోవచ్చు.
అదే సమయంలో ఈక్విటీ, డెట్, గోల్డ్‌లలో సమతుల్య పెట్టుబడులు పెట్టే మల్టీ అసెట్ ఫండ్లు కూడా మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. వైట్ ఓక్ క్యాపిటల్ అధ్యయనం ప్రకారం 55 శాతం డెట్, 25 శాతం ఈక్విటీ, 20 శాతం బంగారం కలిగిన పోర్ట్‌ఫోలియో సగటున 11.61 శాతం వార్షిక రాబడిని ఇచ్చినట్లు వెల్లడైంది.















