బాలీవుడ్ టెలివిజన్ నటి మౌని రాయ్ వైవాహిక జీవితానికి ముగింపు పలకడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వ్యాపారవేత్త సూరజ్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు మౌని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే అసలు వివాదం అక్కడితో ఆగలేదు. విడాకుల ప్రకటన తర్వాత మౌనిపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా ఆమె స్నేహితురాలు, బాలీవుడ్ నటి దిశా పటానీని ఈ వ్యవహారంలోకి లాగుతూ నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో మౌని, సూరజ్ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో గత కొన్ని రోజులుగా వీరి మధ్య విభేదాలపై వార్తలు వచ్చాయి. చివరకు ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ.. “వ్యక్తిగత ప్రాధాన్యతల్లో మార్పుల కారణంగా పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం.. దయచేసి మా గోప్యతను గౌరవించండి” అంటూ పేర్కొన్నారు.

కానీ నెటిజన్లు మాత్రం ఆగలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండానే మౌని స్నేహితురాలు దిశా పటానీపై ఆరోపణలు చేస్తూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి మరింత విషమించడంతో మౌని రాయ్ తన విడాకుల పోస్టు కామెంట్ సెక్షన్‌ను పూర్తిగా ఆఫ్ చేసింది. అయినప్పటికీ ట్రోల్స్ తగ్గకపోవడంతో ఆమె పాత పోస్టుల దగ్గర కూడా దిశాపై నెగటివ్ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

కాగా 2022లో గోవాలో మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల్లో అట్టహాసంగా జరిగిన మౌని-సూరజ్ వివాహం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ నాలుగేళ్లకే ఈ జంట విడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.