మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జాట్ తాలూకా మోటేవాడి గ్రామంలో మార్గుబాయి దేవి యాత్ర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోడ కూలి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో వందలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో తలదాచుకున్నారు. ఇదే సమయంలో గోడ, రేకులు ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆలయ ప్రాంగణంలో సుమారు 350 మంది భక్తులు ఉన్నట్లు సాంగ్లీ ఎస్పీ తుషార్ దోషి తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.















