కేరళ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది..! మార్క్సిస్టు దిగ్గజ నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను సీపీఎం శాసనసభాపక్ష నాయకుడిగా ఎంపిక చేస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆసక్తికరంగా, ఇదే రోజున ఏఐసీసీ కూడా V D సతీశన్ ను కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీపీఎం కేవలం 26 సీట్లకే పరిమితమవగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 సీట్లతో ఘన విజయం సాధించింది.
ఈ ఓటమి తర్వాత పార్టీలో యువ నాయకత్వానికి అవకాశం ఇస్తారన్న చర్చ జోరుగా సాగింది. అయితే చివరికి పార్టీ అనుభవానికే పెద్దపీట వేసింది. జాతీయ స్థాయిలో సీపీఎంకి బలమైన ముఖచిత్రంగా ఉన్న పినరయి విజయన్ పరిపాలనా అనుభవం, రాజకీయ వ్యూహాలు ప్రతిపక్షానికి బలం చేకూరుస్తాయని పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా వి.డి. సతీశన్ లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు పినరయి సరైన ఎంపిక అని సీపీఎం అంచనా వేస్తోంది. కానీ మరోవైపు, ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వామపక్ష శిబిరంలో వ్యక్తమవుతోంది.














