
రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపుల కోసం విడుదల చేస్తాం
తక్షణమే పిఆర్‌సి నివేదిక సమర్పించాలని కమిటీకి ఆదేశం
నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటాం
జూన్ 1లోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు
ప్రతి రెండు నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాలు సమావేశమై
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలి
ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత
ఉద్యోగులు రాజకీయ నాయకులుగా వ్యవహరించవద్దు
ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల భేటీలో సిఎం రేవంత్‌రెడ్డి
ఉద్యోగ సంఘాల నేతల సంతృప్తి
5న తలపెట్టిన నిరసన కార్యక్రమాల ఉపసంహరణ
స్పష్టం చేసిన జేఏసీ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగు ల సమస్యల పరిష్కారంపై కీలక ముందడుగు ప డింది. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే నా లుగు అంశాలపై సిఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ సం ఘాలకు స్పష్టమైన హామీనిచ్చారు. వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ సంఘాల జేఏసి నాయకులతో సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో రోజులుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న పీఆర్సీ అంశంపై తక్షణమే నివేదిక సమర్పించాలని కమిటీని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ఆ నివేదిక ఆధారంగా పీఆర్సీపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల జేఏసి నాయకులకు స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ముఖ్యమంత్రి తెలిపారు. జూన్ 1 లో గా ఆరోగ్య భద్రత కార్డులను (ఈహెచ్‌ఎస్ హెల్త్‌కార్డులను) ఉద్యోగులకు అందిస్తామని, ప్రతి రెం డు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత తమదని సిఎం పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ము ఖ్యంగా పీఆర్సీ, హెల్త్ కార్డులు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వంటి అంశాలపై స్పష్టమైన హామీలు రావడంతో ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో స మావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపిలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉద్యోగ సంఘాల జేఏసి నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస రావు, వి. లచ్చిరెడ్డి, జి. శ్రీనివాస్ రెడ్డి, పి. దామోదర్ రెడ్డి, శ్యాం, ముజీబ్‌హుస్సేనీ, జి. సదానందం గౌడ్, వి. రవీందర్ రెడ్డి, ఎంబి కృష్ణయాదవ్, ఎంఏ ఖాదర్, జి.నిర్మల, టి.లక్ష్మణ్‌గౌడ్, సహదేవ్, ప్రణయ్, వి. రాజశేఖర్, కె. రామకృష్ణ, ఎస్. రాములు, పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసి, ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సిఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 13,100 మంది సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చారిత్రాత్మక నిర్ణయమని ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు.
ఉద్యోగుల సహకారంతో పథకాలు విజయవంతం
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే తొలి నిర్ణయం తీసుకున్నామని, ప్రతి నెలా ఒకటో తేదీకే జీతాలు అందేలా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. రెండేళ్లలో రాష్ట్రంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సిఎం వివరించారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామని, ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామని ఆయన తెలిపారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశామన్నారు. ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉద్యోగుల జేఏసి చైర్మన్ మారం జగదీశ్, టిజిఈజేఏసి చైర్మన్ లచ్చిరెడ్డిలు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వస్తానంటే వెల్‌కం చెబుతా....
ఉద్యోగులు రాజకీయ నాయకులుగా వ్యవహారించవద్దని, అధికారులను, ఐఏఎస్‌లను బెదిరించకుండా సామరస్యకంగా మాట్లాడుకొని పనులు చేయించుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులకు హితవు పలికారు. మీరు ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వస్తానంటే తాను వెల్‌కం చెబుతానని, కానీ, ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి మేలు చేసేలా వ్యవహారించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అధికారులకు, ఐఏఎస్‌లకు మనోభావాలు ఉంటాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.













