
నీట్ పరీక్ష రద్దుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై ఫైరయ్యారు. 22 లక్షల విద్యార్థుల కలలు చిన్నాభిన్నం అయ్యాయని.. కఠోర శ్రమ, త్యాగాలు వృథా అయ్యాయని మండిపడ్డారు. పేపర్ లీక్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు చేశారు. దీనిపై స్పందించిన రాహుల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ నగలు అమ్మి పిల్లలను చదివించారని.. రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష రాస్తే వారికి లభించిన ప్రతిఫలం ఇదేనా?.. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే ఈ పేపర్ లీక్ జరిగిందని విమర్శించారు.
మరోవైపు, నీట్ రద్దుతో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఎన్టీఏ స్పందించింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై సిబిఐతో దర్యాప్తు చేయిస్తామని తెలిపింది. కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత మరోసారి నీట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని.. తదుపరి పరీక్షకు అభ్యర్థులు మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పనిలేదని.. ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, ఈనెల 3న నీట్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే.













