
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మె రెండో రోజు గురువారం నాటికి ఉద్రిక్తకరంగా మారింది. ముగ్గురు కార్మికులు ప్రభుత్వం తమపట్ల నిర్లక్షం వహిస్తుందన్న ఆగ్రహంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వీరిలో నర్సంపేటలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా కర్మాన్‌గాట్ వద్ద గురువారం రాత్రి మృతిచెందారు. ఆయన మృతదేహం డిఆర్‌డిఒ అపోలో ఆసుపత్రిలో ఉంచారు. అలాగే మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రెండో రోజుకే ఆర్‌టిసి కార్మిక సమ్మె తీవ్రతరం దాల్చడంతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, మీ డిమాండ్ల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సమ్మెను విరమింపచేసేందుకు శుక్రవారం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఐదుగురు మంత్రుల క్యాబినెట్ సబ్‌కమిటీ కార్మిక సంఘాలతో సమావేశం కావాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. కార్మిక సంఘాలతో చర్చించబోయే మంత్రివర్గ ఉపసంఘంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులుగా ఉన్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇలా ఉండగా ఆర్‌టిసి కార్మిక సంఘాలు తమ సహ ఉద్యోగులు ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సమ్మె ఉధృతమై మరింత మంది తీవ్ర నిర్ణయం తీసుకోక ముందే తమ డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక సంఘాల జెఎసి కోరుతూనే మరో వైపు వారం రోజుల తమ ఆందోళన కార్యాచరణను ప్రకటించింది. ఆర్‌టిసి కార్మిక సమ్మెకు భారతీయ జనాతా పార్టీ మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.
మంత్రిమండలి సమావేశం ముగిసిన వెంటనే నలుగురు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహా, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆర్‌టిసి కార్మికుల సమ్మెను ఉద్దేశించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. సమ్మె పరిష్కరించేందుకు ప్రభుత్వం సత్వరమే నిర్ణయాలు తీసుకుంటుందని, శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని వారు పిలుపునిచ్చారు. ఇలా ఉండగా నర్సంపేటలో గురువారం ఉదయం ఆర్‌టిసి డిపో ఎదుట శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతన్ని వరంగల్‌ఓని ఎంజిఎం ఆసుపత్రికి తరలించడం అక్కడ అతని పరిస్థితి విషయమంగా ఉండడంతో సాయంత్రం హైదరాబాద్‌లోని డిఆర్‌డిఎ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐతే అతను ఆసుపత్రికి చేరుకోక ముందే మార్గమధ్యంలో మరణించి ఉంటారని వైద్యులు ప్రకటించారు. ఇలా ఉండగా సాయంత్రం నల్గొండలో డ్రైవర్ వెంకన్న కూడా అదే తరహాలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో తోటి కార్మికులు నివారించడంతో ప్రాణాపాయం తప్పింది.
కాగా భద్రాచలం డిపోలో పనిచేసే డ్రైవర్ లింగారెడ్డి ఖమ్మంలో తన ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు కార్మిక సంఘాల సమాచారం. మెరుగైన వైద్యం కోసం అతడిని కూడా హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు స్థానిక కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఇలా ఉండగా ఆర్‌టిసి జెఎసి వారం రోజుల తమ ఆందోళన కార్యాచరణను కూడా తాజాగా గురువారం ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు ఆందోళన కార్యాచరణను ప్రకటించింది. ఇందులో శుక్రవారం అన్ని డిపోల ముందు మౌన ప్రదర్శనలు, 25న అన్ని డిపోలలో వంటావార్పు, 26 న అన్ని రీజియన్ లలో, జిల్లాలలో కార్మిక కవాతు, 27న మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించుట., 28 న మహిళ ఉద్యోగు లతో అన్ని డిపోలలో బతుకమ్మలతో నిరసన ప్రదర్శనలు, 29 న అన్ని డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
సమ్మె రెండో రోజూ కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దాదాపు అన్ని డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు ఉదయం నుంచే అడ్డుకోవడం జరిగింది. ఆర్‌టిసి జెఎసి పిలుపు మేరకు ఉదయం నుంచే కార్మికులు డిపోలు ముందు ధర్నాలు చేపట్టారు. ఈ క్రమంలో డిపోల వద్ద ధర్నా చేస్తున్న కార్మికులను పలు చోట్ల పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఆర్‌టిసి జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్నతో పాటు పలువురు కీలక నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఈదురు వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన పంథాను మారుస్తామని హెచ్చరించారు. ‘మేము నిబంధనల ప్రకారమే సమ్మెకు దిగామని, ప్రభుత్వం అర్థరాత్రి పిలిచినా చర్చలకు సిద్ధమేనని అన్నారు. ప్రభుత్వం అలసత్వం వీడాలన్నారు.
జనగామ డిపో వద్ద టెంట్లు తొలగించడంతో కార్మికులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భద్రాచలంలో ఆర్‌టిసి ఇన్ గేటు వద్ద కార్మికులు నిరసన తెలిపేందుకు వేసుకున్న టెంట్‌ను పోలీసులు తొలగించారు. వరుసగా రెండో రోజు బస్సులు నిలిచిపోవడంతో సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విద్యార్థులు, ఉద్యోగులు, సరైన సమయానికి చేరుకోలేక అవస్థలు పడ్డారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ప్రయాణీకులు ఆరోపించారు. మరోవైపు ప్రయాణీకులు ఇబ్బందులకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసు భద్రత మధ్య పలు చోట్ల అద్దెబస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను నడిపింది. తాత్కాలిక కాంట్రాక్టు పద్దతిలో డ్రైవర్లు, కండక్టర్లను తీసుకుని బస్సులను నడుపుతోంది.


