
బాటసింగారం మార్కెట్‌లో పండ్లు అమ్మి వచ్చిన డబ్బులతో ఇంటికి బయలుదేరిన ఓ రైతు ఆటోలో రూ. 55వేలు చోరీకి గురైన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన రైతు పోలు అశోక్ బాటసింగారం మార్కెట్‌లో పండ్లు విక్రయించి వచ్చిన రూ.55 వేల నగదుతో ఇంటికి వెళ్లేందుకు బయలు దేరాడు.ఈ క్రమంలో మార్కెట్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద దిగిన అశోక్ అక్కడి నుంచి నల్ల చెరువు జిల్లా బస్‌స్టాప్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అయితే అప్పటికే ఆటోలో కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి మాటల్లో పెట్టి, రైతు జేబులో ఉన్న రూ.55 వేల నగదును అపహరించినట్లు తెలుస్తోంది. కొంతసేపటి తర్వాత డబ్బులు కనిపించకపోవడంతో రైతు మోసపోయిన విషయం గుర్తించి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.












