జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో ఓటమిని చవి చూసింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. భారీ స్కోర్ సాధించినప్పటికీ.. ఛేజింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైంది. అయితే మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపాలు కావడానికి కారణాలను ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు. ఫీల్డింగ్‌లో తమ జట్టు విఫలమైందని.. కీలకమైన క్యాచ్‌లు వదిలేశామని పరాగ్ అన్నాడు.

‘‘నైపుణ్యం పరంగా మా ప్రణాళికలను సరిగ్గానే అమలు చేశాం. కానీ, కీలకమైన క్యాచ్‌లను వదిలేశాం. అదీనూ భారీ షాట్‌లు కొట్టే అభిషేక్ వంటి ప్లేయర్లు ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టడం నష్టం చేసింది. ఇలాంటి వారి నుంచి రెండో ఛాన్స్ వస్తుందని ఆశించలేం. మ్యాచ్‌ను మా నుంచి లాగేశారు. మేం ఫీల్డింగ్‌లో ఇంకాస్త మెరుగు కావాల్సిన అవసరం ఉంది. గేమ్‌లో ఇదంతా భాగమే అయినా.. ఇంప్రూవ్ చేసుకుంటాం. తర్వాత మ్యాచ్‌ నాటికి సరి చేసుకుని బరిలోకి దిగుతాం. తొలుత మేం బ్యాటింగ్‌ో కనీసం మరో 15 పరుగులు చేయాల్సింది. ఆఖర్లో సన్‌రైజర్స్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. యార్కర్లను చక్కగా అమలు చేశారు’’ అని పరాగ్ తెలిపాడు.