అధిక ఆదాయం కలిగిన కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలిసింది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన వారికి ఎల్పీజీ సబ్సిడీని రద్దు చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే చమురు కంపెనీలకు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. అయితే, ఈ నిబంధన 2015 డిసెంబర్ నుంచే అమల్లో ఉన్నప్పటికీ, గతంలో వినియోగదారులు స్వచ్చందంగా సబ్సిడీ వదులుకునేవారు. కానీ, ఇప్పుడు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పాన్‌కార్డ్ డేటా ఆధారంగా ఎవరి ఆదాయం నిర్ణీత పరిమితికి మించి ఉందో గుర్తించి, వారి సబ్సిడీని తొలగించేందుకు జాబితాలను సిద్ధం చేసినట్టుగా తెలిసింది. ఈ కొత్త విధానం ప్రకారం, కేవలం గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆదాయం మాత్రమే కాకుండా, వారి జీవిత భాగస్వామి ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

వీరిద్దరిలో ఎవరి ఆదాయం రూ. 10 లక్షలు దాటినా ఆ కుటుంబం సబ్సిడీకి అనర్హులుగా ప్రకటించనున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులకు వారి మొబైల్ నంబర్లకు హెచ్చరిక సందేశాలు అందుతున్నాయి. అందులో ఐటీ రికార్డుల ప్రకారం మీ ఆదాయం పరిమితి దాటిందని, దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా స్పందించాలని, లేనిపక్షంలో సబ్సిడీ నిలిపివేస్తామని కేంద్రం పేర్కొంటుంది. ఈ చర్య వల్ల ప్రభుత్వ ఖజానాపై సబ్సిడీ భారం తగ్గడంతో పాటు ఆ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్ల్లీంచవచ్చని కేంద్రం భావిస్తున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ కింద కనెక్షన్లు పొందిన కోట్లాది మంది లబ్ధిదారులకు ఈ నిబంధనల వర్తించదని, వారికి లభించే ప్రత్యేక సబ్సిడీ యధావిధిగా కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది.