
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్డిఎస్ ఏ) చైర్మన్ ఈ నెల 20న మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శన పూర్తిగా అధికారిక, సాంకేతిక పరమైనదేనని, దానికి రాజకీయ రంగు లేద ని సాగునీటి శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్డిఎస్ఏ చైర్మన్ పర్యటన ఉద్దేశ్యం ప్రస్తుత పరిశోధనల పురోగతిని సమీక్షించడం, అలాగే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బృందాలకు సాం కేతిక మార్గదర్శకత్వం ఇవ్వడమేనని పేర్కొన్నారు. ఈ పర్యటన పూర్తిగా ఎన్డిఎస్ఏ అధికారిక సాంకేతిక పర్యవేక్షణ మాత్రమేనని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ ప్రణాళికా, ప్రామాణిక ప్రమాణాలు, ఇంజినీరింగ్ పద్ధతులు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించడానికే ఉద్దేశించినదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి అగ్రగామి సంస్థ అయిన ఎన్డిఎస్ఏ, మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లర్లు ఘటన అనంతరం గతంలో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్డిఎస్ఏ సిఫార్సుల మేరకు కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు పరిశోధనలు, అధ్యాయన బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ అధ్యయనాల ఆధారంగా పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేయడానికి మెస్సర్స్ ఆఫ్రె సంస్థను డిజైన్ కన్సల్టెంట్గా నియమించామన్నారు. సిడబ్య్లూపిఆర్ఎస్, ఆఫ్రె సంస్థల మధ్య సమన్వయ సమావేశాల అనంతరం సమగ్ర ప్రణాళిక రూపొందించి, గత వారం నుంచి ఫీల్ స్థాయి పరిశోధనలు ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్డిఎస్ఏ చైర్మన్ అధికారికంగా పర్యటించారన్నారు. ముఖ్యమంత్రి, సాగునీటి మంత్రులు మేడిగడ్డను సందర్శించినప్పుడు ఎన్డిఎస్ఏ చైర్మన్ మీడియా సమావేశాల్లో పాల్గొనలేదని శ్రీధర్ స్పష్టం చేశారు. ఇందులో చైర్మన్ పాత్ర పూర్తిగా సాంకేతిక పరిశీలన, మార్గదర్శకత్వం వరకే పరిమితమైందని, దానికి ఎలాంటి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయవద్దని కోరారు.











