ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి అతి చిన్న వయస్సులోనే కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశాడు. అగ్రరాజ్యంలో చదవు పూర్తి చేసుకొని పట్టా అందుకున్న మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత విషాదాన్ని నింపింది.

26 ఏళ్ల మహమ్మద్ కుమెల్ షేక్ శాన్‌ఫ్రాన్సిస్కో‌లోని గోల్డెన్ గేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇటీవలే స్నాతకోత్సవం జరగ్గా.. తన గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. అయితే ఆ మరుసటి రోజే కుమెల్ తన నివాసంలో విగతజీవిగా కనిపించడంతో స్నేహితులు దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతి పట్ల అమెరికాలోని భారత కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కుమెల్ మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.