
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో ఆరంభంలో ఓటములను ఎదురుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్ చరిత్రలో సిఎస్కెకిదే భారీ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగగా.. ఆ తర్వాత బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే ఈ విజయాన్ని తల్లిని కోల్పోయిన ముకేశ్ చౌదరికే అంకితం ఇస్తున్నట్లు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
‘‘ముకేశ్కిది క్లిష్ట సమయం. అతడి తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు. ఇలాంటప్పుడు మేమంతా అండగా ఉంటాం. అంత్యక్రియలు ముగిసిన వెంటనే అతు జట్టుతో పాటు చేరిపోయాడు. ఎప్పుడు అవసరమైనా జట్టు తోడుగా నిలుస్తుందని అతడికి తెలుసు. ఈ మ్యాచ్ విజయాన్ని ముకేశ్‌కే అంకితం చేస్తున్నా. అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోనూ బరిలోకి దిగాడు. ఇలా చేయాలంటే మానసికంగానూ దృఢంగా ఉండాలి. అతడి కోసం ముంబైపై విజయం సాధించాలని ముందే బలంగా భావించాం’’ అని రుతురాజ్ అన్నాడు.










