మన తెలంగాణ/హైదరాబాద్: నిన్న, నేడు, రేపు.. కెసిఆర్ వెంటే అనే నినాదంతో బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా కెసిఆర్, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీకి తమ అచంచల మద్దతును ఆస్ట్రేలియాలోని తెలంగాణ బిడ్డలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంలో గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు తాము నిరంతరం కష్టపడతామని స్పష్టం చేశారు. ‘నాటి ఉద్యమం నుండి మొదలైన మా ప్రస్థానం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కొనసాగుతుందన్నారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మా బాధ్యత‘ అని నాగేందర్ రెడ్డి తెలిపారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలోనూ చురుకుగా ప్రచారం నిర్వహించి తమ కట్టుబాటును నిరూపించామని, భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా బృందం ఎప్పటికీ పార్టీ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు, వినయ్ చెలుపాటి, ఉదయ్ సింహా రెడ్డి, సూర్య రావు, సనిల్ రెడ్డి, సతీష్ పులిపాక, అశోక్ ఈగ, నితీష్ గౌడ్, వెంకట్, భాస్కర్, విశ్వనాథ్, సంజూ రెడ్డి, తెలంగాణ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రవాస తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు.