
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 200లకు పైగా సీట్లు గెలిచి, రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సిఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. బిజెపి ఎన్ని కుట్రలు చేసినా.. తమ పార్టీనే గెలుస్తుందని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేయడానికి తప్పుడు ఎగ్జిట్ పోల్స్‌ను సృష్టించారని ఆరోపించారు. 2021, 2024లోనూ బిజెపి ఇదే విధంగా చేసిందని.. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారని అన్నారు. వర్చువల్‌గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారాలు, పోలింగ్ సమయంలో పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల సమయంలో బెంగాల్‌లో మోహరించిన కేంద్ర బలగాలు టిఎంసి కార్యకర్తలతో క్రూరంగా ప్రవర్తించారని.. ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. మే 4న జరిగే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఆ రోజున అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు, పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లెక్కింపు కేంద్రాల్లో 24 గంటలు నిఘా పెట్టాలన్నారు.










