దినేష్ త్రివేదిని బంగ్లాదేశ్‌లో భారత తదుపరి హైకమిషనర్‌గా సోమవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల మధ్య ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాలు సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఢాకాకు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిని పంపాలన్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ తీసుకుంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ కాలంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.పశ్చిమ బెంగాల్‌కు చెందిన 75 ఏళ్ల దినేష్ త్రివేది సీనియర్ రాజకీయ నాయకుడు. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా, అలాగే బారక్‌పూర్ లోక్‌సభ ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు.

2021 ఫిబ్రవరిలో ఆల్ ఇండియా తృణమూల్‌కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. అమెరికాలో ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా ఉన్న ప్రణయ్ వర్మ స్థానంలో దినేష్ త్రివేది బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రణయ్ వర్మను బెల్జియం, యూరోపియన్ యూనియన్‌కు భారత తదుపరి రాయబారిగా నియమించారు. 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణించాయి. అయితే అనంతరం ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియలో ప్రణయ్ వర్మ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహ్మాన్ భారత్‌ను సందర్శించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ఈ చర్చలు ప్రధానంగా కేంద్రీకృతమయ్యాయి. ఇక ఫిబ్రవరి 17న ఢాకాలో తారిక్ రెహ్మాన్ ప్రధానమంత్రి పదవీ స్వీకార కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి హాజరు కావడంతో సంబంధాల సాధారణీకరణకు మరింత ఊతమిచ్చినట్లు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తారిక్ రెహ్మాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.