బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లంబాడాలు అంటే చిన్న చూపు ఉందని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ధ్వజమెత్తారు. గతంలో తమ పార్టీ లంబాడాను కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నిలబెడితే పట్టుబట్టి ఓడించారని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు పోరాడితే, కెసిఆర్ కుటుంబ సభ్యులు పదవులు పొంది ఎంజాయ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్దిక ఇబ్బందుల్లో నెట్టింది కెసిఆరేనని ఆయన విమర్శించారు. కెటిఆర్ రాజకీయాలు రాష్ట్రానికి పనికి రావన్నారు. భవిష్యత్తులో ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే తగు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కెటిఆర్ నిజాయితీ గురించి తమకు తెలుసునని, బాగోతం మొత్తం బయటపెడతామని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఏమైనా అంటే కెటిఆర్‌ను ప్రజల్లో తిరగనీయమని ఎంపీ బలరాం నాయక్ హెచ్చరించారు.