ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ కామెడీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పుడు మళ్లీ తన వింటేజ్ స్టైల్‌లో బలమైన కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. యంగ్ హీరో శర్వానంద్‌తో ఆయన ఓ భారీ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించబోతున్నారని సమాచారం. అయితే మొదట ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను టేకప్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథ, స్క్రీన్‌ప్లే పనులు పూర్తయిన ఈ సినిమాను శ్రీను వైట్ల పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారట. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన దూకుడు, రెడీ, కింగ్ తరహా వినోదాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో శ్రీను వైట్ల ఉన్నారట. శర్వానంద్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ రెండింటినీ బాగా ఉపయోగించేలా స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారని తెలిసింది. ఈ సినిమాతో శర్వానంద్‌కు పూర్తి కమర్షియల్ కామెడీ హిట్ ఇవ్వాలని డైరెక్టర్ బలంగా ఫోకస్ చేస్తున్నారట.