
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసి కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆర్టీసి కార్మికులు క్షణికావేశానికి లోనుకావద్దని, వారి సమస్యలను పరిష్కరించడానికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రెవెన్యూ రిసోర్సన్ కమిటీ వేశామని, ఈ కమిటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులు ఉన్నారని రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరిలతో కలిసి మంత్రి పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ప్రయోజనాలను గతంలో రెండునెలల్లో చెల్లించేవారని, గత ప్రభుత్వం రిటైర్‌మెంట్ బెనిఫిట్ బిల్లులను
వేల కోట్ల రూపాయలను పెండింగ్‌లో పెట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక నెలకు రూ.750 కోట్లను చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకా రూ.6వేల కోట్ల రిటైర్‌మెంట్ ప్రయోజనాలు ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల ఆత్మహత్యాయత్నం ఘటనల గురించి తెలిసి సిఎం రేవంత్‌రెడ్డి చలించిపోయారని మంత్రి పొంగులేటి తెలిపారు. అందుకే కేబినెట్ మీటింగ్‌ను మధ్యలోనే ఆపివేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను ఇచ్చేందుకు మంత్రుల వేతనాల నుంచి సగం జీతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించిందని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు.


