న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు ఎల్‌ఎన్‌జీ, యూరియా, మెథనాల్ దిగుమతులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన యూనియన్ క్యాబినెట్‌ బుధవారం కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు రూ.37,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించనున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌మాట్లాడుతూ, ఈ పథకం కింద సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేసే ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. “భారత్ ప్రపంచంలోనే ఎక్కువ బొగ్గు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి. మనకు 401 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి వచ్చే 200 సంవత్సరాలకు సరిపోతాయి. బొగ్గు నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాం. 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తాం. ఈ గ్యాసిఫికేషన్ ద్వారా 50 వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఏడాదికి రూ. 6,300 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని వైష్ణవ్ వెల్లడించారు.

బొగ్గు గ్యాసిఫికేషన్ అంటే పొడి ఇంధనాన్ని సింథటిక్ గ్యాస్ (సింగ్యాస్)గా మార్పు చేయడం. ఈ సింగ్యాస్‌ను ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. దీని ద్వారా మెథనాల్, ఎరువులు, హైడ్రోజన్, రసాయనాల ఉత్పత్తి సాధ్యమవుతుందని ప్రభుత్వం తెలిపింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయాలన్న జాతీయ లక్ష్య సాధనలో ఈ పథకం కీలక ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా ఎల్‌ఎన్‌జీ, యూరియా, అమోనియా, మెథనాల్ వంటి కీలక ఉత్పత్తుల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని వివరించింది. ప్రస్తుతం దేశ అవసరాల్లో 50 శాతం కంటే ఎక్కువ ఎల్‌ఎన్‌జీ దిగుమతుల ద్వారానే వస్తోందని, యూరియా, అమోనియా, మెథనాల్ దిగుమతులు కూడా అధిక స్థాయిలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వాటి దేశీయ ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు.

ఈ పథకం కింద ప్లాంట్, యంత్రాంగ వ్యయంలో గరిష్ఠంగా 20 శాతం వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రాజెక్టుల ఎంపిక పారదర్శక పోటీ బిడ్డింగ్ విధానంలో జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు వ్యయం, బొగ్గు వినియోగం, సింగ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాల ఆధారంగా మూల్యాంకనం చేపడతారు. ప్రోత్సాహక మొత్తాన్ని నాలుగు సమాన వాయిదాల్లో విడుదల చేయనున్నారు. ఒక్కో ప్రాజెక్టుకు గరిష్ఠంగా రూ.5,000 కోట్లు, ఒక్కో ఉత్పత్తికి గరిష్ఠంగా రూ.9,000 కోట్లు, ఒక్కో సంస్థ సమూహానికి మొత్తం ప్రాజెక్టులపై గరిష్ఠంగా రూ.12,000 కోట్ల వరకు ప్రోత్సాహకాలు పరిమితం చేశారు. ఈ పథకం ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సమీకరించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. 75 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా రూ.6,300 కోట్ల ఆదాయం లభించే అవకాశముందని తెలిపింది. భారతదేశంలో 401 బిలియన్ టన్నుల బొగ్గు, 47 బిలియన్ టన్నుల లిగ్నైట్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం దేశ ఇంధన వినియోగంలో బొగ్గు వాటా 55 శాతం కంటే ఎక్కువగా ఉందని వెల్లడించింది.

ఎల్‌ఎన్‌జీ, యూరియా, అమోనియా, మెథనాల్ తదితర దిగుమతులపై 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం సుమారు రూ.2.77 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దిగుమతులపై ఆధారపడటం దేశానికి సవాలుగా మారిందని పేర్కొంది. 2021లో ప్రారంభించిన నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్, 2024 జనవరిలో ఆమోదించిన రూ.8,500 కోట్ల పథకానికి కొనసాగింపుగానే ఈ తాజా ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రూ.6,233 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని తెలిపింది.