
భువనేశ్వర్: అక్క చనిపోయిందని ఆమె అకౌంట్‌లో ఉన్న డబ్బులు ఇవ్వడంలేదని సోదరి అస్థిపంజరంతో బ్యాంక్‌కు చేరుకొని తమ్ముడు నిరసన తెలిపిన సంఘటన ఒడిశా రాష్ట్రం కేంఝర్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... దియానల్లి గ్రామంలో గ్రామంలో జీతూ ముండా(50) అనే గిరిజనుడు నివసిస్తున్నాడు. జీతూ అక్క కల్రా ముండా(56)కు మాలిపోసిలోని గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. జనవరి 26న ఆమె మృతి చెందడంతో ఆమె ఖాతాలో రూ.20 వేల రూపాయలు ఉన్నాయి. జీతూ పలుమార్లు బ్యాంకు అధికారులను కలిసి తన అక్క ఖాతాలో డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఖాతాదారుడు వస్తేనే డబ్బులు ఇవ్వడం జరుగుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు. తన అక్క చనిపోయిందని బ్యాంకు అధికారులకు తెలిపాడు. ఆయినా కూడా అతడి మాటాలను బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. దీంతో అతడు అక్క అస్థిపంజరాన్ని తీసుకొని బ్యాంక్‌కు వెళ్లడంతో ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. వెంటనే బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. డబ్బు విత్ డ్రా చేసి ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి జీతూ వెళ్లిపోయాడు.













