
పశ్చిమబెంగాల్‌లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మొదటి దశ పోలింగ్‌లో అత్యధికంగా 92 శాతం ఓటింగ్ జరగడం ఎవరికి వారే గెలుపు మాకే అన్న ఆశల పల్లకీలో ఊగుతున్నారు. ఈ మొదటి దశ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా సవరణ తర్వాత 9.9 శాతం నుండి 11.6 శాతం వరకు ఓటర్ల పేర్లు తొలగించడంతో ఓటర్ల సంఖ్య తగ్గిపోయినప్పటికీ పోలింగ్ శాతం మాత్రం ఎక్కువగానే నమోదు కావడం విశేషం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల పరిధిలో తృణమూల్ కాంగ్రెస్ 92, బిజెపి 59 స్థానాలు సాధించుకున్నాయి. అప్పటి ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడా కనిపిస్తోంది. మొత్తం 294 సీట్లకు తానే తృణమూల్ అభ్యర్థినని, తమ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా తనపై నమ్మకం ఉంచాలని ఉధృతంగా ఆమె ప్రచారం సాగించారు. ఆమె పాప్యులారిటీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర బిందువు అయింది. అయితే ఎంతవరకు ఈ పాప్యులారిటీ ఓట్లను కురిపిస్తుందో చెప్పలేం.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ విస్మరించి ఆమె మద్దతుదారులు అలాగే కొనసాగుతారా అన్నది ప్రశ్న. టిఎంసి గత పదిహేనేళ్ల పాలనలో పారిశ్రామిక వృద్ధి లేదు సరికదా క్షీణత కనిపిస్తోంది. రుణభారం ఎక్కువైంది. నిరుద్యోగం తాండవిస్తోంది. పాలనలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. పార్టీ అంతర్గత సమస్యలు, హింసాత్మక సంఘటనలు తీవ్రంగా సాగుతున్నాయి. ఇంతటి గందరగోళంలో కూడా ప్రజలు మమతా బెనర్జీ వ్యక్తిగత నాయకత్వాన్ని లేదా ప్రతిష్ఠను పొగుడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వ పాలనను తిడుతున్నారు. మమత వేరు, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని విడివిడిగా ప్రజలు చూస్తున్నారు. ఈ రెండురకాల విభిన్న అభిప్రాయాలు సమాంతరంగా సాగుతున్నాయి. అందుకని ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చెప్పలేం.
ఎన్ని లోపాలున్నా ఆమె సంక్షేమ పథకాల నమూనా ఆ లోపాలను కప్పిపుచ్చుతోంది. బెంగాల్ వీర వనితగా, రక్షకురాలిగా, పోషకురాలిగా ప్రజలు భావిస్తూ దీదీ అని సంబోధిస్తున్నారు. ఆమె ఏదిచేసినా బెంగాల్ ప్రయోజనాల కోసమే అన్న నమ్మకం చెక్కుచెదరలేదు. ఓటర్ల జాబితా సవరణలో జరిగిన తప్పులపై ఆమె మడం తిప్పకుండా పోరాటం సాగించారు. చివరకు సుప్రీం కోర్టు ముందు ఆమె స్వయంగా వాదించడం విశేషం. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో 2021 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 82.30 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 213 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ సాధించుకుని అధికార పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకుంది. గురువారం 3.6 కోట్ల మంది ఓటర్లు ఓటు వేసినట్టు రికార్డయి 92.25 శాతం పోలింగ్ నమోదైంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పశ్చిమబెంగాల్ తోపాటు తమిళనాడులో కూడా అత్యంత ఎక్కువ శాతం పోలింగ్ ఇదేనని చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.
ఈసారి ఎన్నికల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ నిర్వహించడంలో ఎన్నో వివాదాలు, అనుమానాలు తలెత్తినప్పటికీ మొట్టమొదట 63 లక్షల ఓటర్ల పేర్లను తొలగించి, తరువాత న్యాయ పరిశీలనలో 27 లక్షల ఓటర్లు అనర్హులని ప్రకటించినా, పోలింగ్ ఎక్కడా పలచబడలేదు. మొదటి దశ ఎన్నికలకు ముందు గత వారం ఏడు లక్షల కొత్త ఓటర్లను చేర్చుకోవడమైందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పోల్ అధికారుల వివరాలు ప్రకారం మొదటి దశలో 3.22 లక్షల కొత్త ఓటర్లు ఓటు వేసి ఉంటారని భావిస్తున్నారు. మిగతా దాదాపు 3.88 లక్షల ఓటర్లు రెండో దశ పోలింగ్‌లో ఓటు వేయగలరని అంచనాగా చెబుతున్నారు. ముర్షీదాబాద్‌తో కలుపుకుని, ఉత్తర 24 పరగణాలు, మాల్డా, నాడియా, దక్షిణ 24 పరగణాలలో అనేక జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఓటరు జాబితాలోంచి పేర్లు తొలగించబడ్డాయి. కోల్‌కతాలో అనేక నియోజకవర్గాలకు చెందిన దాదాపు 7 లక్షల ఓటర్లు జాబితా లోంచి తొలగించబడ్డారు. నగరంలోని ఉత్తర, దక్షిణ సెగ్మెంట్లలో ఓటరు సంఖ్య బాగా తగ్గింది.
బీహార్‌లో సర్ ప్రక్రియ తరువాత అంతకు ముందు ఎన్నికల కన్నా ఓటర్ పోలింగ్ శాతం 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పెరిగింది. బీహార్‌లో 2015 లో 56.91 శాతం, 2020లో 57.29 శాతం పోలింగ్ జరగ్గా, 2025లో 67.13 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను సవరించిన తరువాత కొన్ని లక్షల పేర్లను తొలగించారు. ఈ ప్రక్రియపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ, ఖరారైన సంఖ్యతో బీహార్‌లో గత కొన్ని దశాబ్దాలలో లేని విధంగా అత్యధికంగా ఓటింగ్ జరగడం, స్వచ్ఛమైన ఓటర్ల జాబితాతోపాటు బలమైన ఎన్నికల నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 152 నియోజకవర్గాలకే తొలిదశలో పోలింగ్ జరిగింది. సౌత్ దినాజ్‌పూర్‌లో 94.37 శాతం అత్యధికంగా పోలింగ్ జరిగింది. కూచ్‌బీహార్‌లో 93.73 శాతం పోలింగ్ జరిగింది. దేశం లోనే అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ శాతం జరగడానికి బలమైన పార్టీ క్యాడర్లు, జనాభా, సమాజ గమన శీలత, అధికంగా మహిళలు ఓటింగ్‌లో పాల్గొనడం ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. టిఎంసి, బిజెపి ఈ ట్రెండ్ తమకే అనుకూలంగా ఉందని ఎవరికి వారే గొప్పగా ఊహించుకోవడం విశేషం. మొదటి దఫా ఎన్నికల్లో ప్రజలు బిజెపికి గట్టి దెబ్బతీశారని, తమ పూర్తి మద్దతు టిఎంసికి, మమత ప్రభుత్వానికే ఇచ్చారని, 152 స్థానాలకు గాను టిఎంసి కనీసం 125 స్థానాలైనా దక్కించుకుంటుందని 90 శాతం పోలింగ్ జరగడాన్ని ఉదహరిస్తూ టిఎంసి నాయకుడు కునాల్ ఘోష్ ధీమా వ్యక్తం చేశారు.



