
ఎంగేజ్‌మెంట్ తర్వాత వివాహం రద్దు
జూబ్లీహిల్స్ పిఎస్‌లో ఫిర్యాదు
మనతెలంగాణ, సిటిబ్యూరోః ప్రముఖ వ్యాపారవేత్త, దివీస్ ల్యాబ్స్ యజమాని డాక్టర్ మురళికృష్ణ ప్రసాద్ కుటుంబంలో పెళ్లి పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివాహం నిశ్చయం తర్వాత ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలతో వివాహ కార్యక్రమం రద్దైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే పెళ్లి నేపథ్యంలో వరకట్నం కింద ఇచ్చిన రూ.5కోట్లు తిరిగి ఇవ్వాలని వరుడి కుటుంబ సభ్యులను పెళ్లి కూతురు తల్లి విజయ కోరినా స్పందనలేకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దివీస్ యజమాని కుమారుడు, ఆర్‌టిఐ కమిషనర్ కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ ఇరుకుటుంబాల మధ్య మనస్పర్ధలు రావడంతో వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము వరకట్నం కింద ఇచ్చిన రూ. 5కోట్లు తిరిగి ఇవ్వాలని కోరినా వరుడి తరఫున వారు స్పందించకపోవడంతో పెళ్లి కుమార్తె తల్లి విజయ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.











