
ప్రతి గింజ కొంటామన్న కేంద్రం 25 శాతం మాత్రమే కొంటోంది
రైతుల భారాన్ని మోస్తున్న రాష్ట్రం
ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాల్సింది కేంద్రమే
బండి సంజయ్‌కు తుమ్మల లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి గింజ కొంటామన్న కేంద్రం కేవలం 25 శాతం మాత్రమే కొంటోందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాసిన బహిరంగ లేఖకు తుమ్మల ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు శనివారం ఏడు పేజీల లేఖలో కేంద్ర విధానాలను ఎండగట్టారు. ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రాన్ని అడగడం రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానని, అసలు ఆ విషయం రాష్ట్ర పరిధిలోనిదే కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రం రైతుల కోసం అనే పథకాలు అమలు చేస్తోందని, రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేశారా అని నిలదీశారు. కేంద్రం ప్రతి ఏటా మద్దతు ధర ప్రకటించి, ఇక మీరు ఎక్కడైనా అమ్ముకోండి అన్నట్లుగా చోద్యం చూస్తోందని, పండించిన పంటలో కేవలం 25 శాతమే కొనుగోలు చేస్తే మిగిలిన పంటను రైతు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు.
ఇందిరా గాంధీ 1966లో ఎంఎస్‌పి విధానాన్ని తెస్తే, 2014 తర్వాత మోదీ ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకుని రాష్ట్రాల మీదకు నెట్టిందని మండిపడ్డారు. పిఎం ఫసల్ బీమా యోజన పేరుతో ప్రయివేట్ కంపెనీలకు కొన్ని వేల కోట్లు దారాదత్తం చేశారని ఆరోపించారు. దీంతో రైతులకు ప్రయోజనం లేదని గత ప్రభుత్వం 2019, -20లో ఆపేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర బిజెపి ఎంపిలు ఢిల్లీకి వెళ్లి కొనుగోలు పరిమితిని ఎత్తేయాలి, మొక్కజొన్న, జొన్న పంటను కూడా కొనాలని ప్రధానిని, వ్యవసాయ మంత్రిని అడగాలని తుమ్మల సూచించారు.












