ఐపిఎల్‌లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సిబి 6.3 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జాకబ్ (20) పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ కోహ్లి 15 బంతుల్లో 23 (నాటౌట్), దేవ్‌దుత్ పడిక్కల్ 13 బంతుల్లో 34 (నాటౌట్) దూకుడుగా ఆడి జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.

బెంగళూరు బౌలర్లు హాజిల్‌వుడ్,భువనేశ్వర్‌ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక దశలో ఢిల్లీ 8 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అంతేగాక పవర్ ప్లే ముగిసే సమయానికి 13 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఐపిఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా పవర్ ప్లేలో ఇంత తక్కువ స్కోరు చేయలేదు.హాజిల్‌వుడ్ నాలుగు, భువనేశ్వర్ మూడు వికెట్లు తీసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. అభిషేక్ పొరెల్ (30), మిల్లర్ (19), జేమీసన్ (12) పరుగులు చేయడంతో ఢిల్లీ కాస్త గౌరవప్రద స్కోరును సాధించింది.