ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరపాలని 1970లో ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఆ సంవత్సరం ఏప్రిల్ 22న అమెరికన్లు లక్షలాదిగా భూమి రక్షణకై వివిధ రాష్ట్రాలలో ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. పర్యావరణ రక్షణకై శాస్త్రవేత్తలు, మేధావులు తపించిన దశాబ్దంగా 70 దశకాన్ని పేర్కొనవచ్చును. శాస్త్రవేత్తల అంచనాలను మించి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుండటంవల్ల మట్టి వేడెక్కుతున్నది. నీటిలో, వాతారణంలో ఉష్ణోగ్రతలు ఏటేటా పెరుగుతున్నవి. మన దేశం తొలిసారిగా 1990, ఏప్రిల్ 22న భూమి దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులతో భూమి వేడెక్కడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించడం వంటి కార్యక్రమాలను నిర్వహించాయి. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించడంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి కారణం భూమిపై ఏ మేరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి? దాని ప్రభావం వలన వాతావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, ప్రాణులకు ఏ విధమైన నష్టం సంభవిస్తున్నది? అనే అంశాలపై ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోవడమే కారణం.

2026వ సంవత్సరం ధరిత్రి దినోత్సవ థీమ్ ‘మనశక్తి - మన గ్రహం (Our power - Our plannet)’ మట్టి ఉష్ణోగ్రతలు 2030 నాటికి 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ అదనంగా నమోదవుతుందని ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ అంచనా వేసింది. ఈ అంచనాలతో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనాలు సరిపోతున్నాయి. ప్రత్యేకంగా భారతదేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై వాటి ప్రభావాలపై స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్లు రాజ్ జాక్సన్, కబీర్ పీ నేతృత్వంలోని పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయన ఫలితాలు ఒళ్లు గగుర్పొడిచే, మనల్ని షాక్కు గురిచేసే ప్రమాదాలను వెల్లడించాయి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం వలన కరువులు, అధిక వర్షాలు పెరుగుతాయి. వీటి ప్రభావం 15-20 సెం.మీ. భూమి పొరపై పడుతుంది. సారం, జీవం ఉండే ఈ మట్టే మనకు ఆహారాన్ని అందించే పంటలను నీటి తేమను, పోషకాలనందిస్తూ వ్యవసాయోత్సత్తుల దిగుబడికి కారణమవుతున్నది. ఇంత ముఖ్యమైన భూమి పైపొర మన దేశంలో సగటున ప్రతి సంవత్సరం ఒక హెక్టారుకు (సుమారు రెండున్నర ఎకరాలు) మట్టి నష్టం 21 టన్నులు కాగా, దేశంలోని మొత్తం వార్షిక మట్టి నష్టం సుమారు 533 కోట్ల మెట్రిక్ టన్నులు నష్టం. ఇందులో 29% (సుమారు 155 కోట్ల మట్టి) భూమి కోత వలన నదుల ద్వారా సముద్రాల్లోకి పోతున్నది. మిగిలిన మట్టి రిజర్వాయిర్లలో, జలాశయాలలో, గాలి ద్వారా ఎక్కడెక్కడికో తరలిపపోతున్నది.

దీనిలో కొంత తిరిగి ఉపయోగపడినా ఆ ప్రాంతాల్లో భూసారాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ తరలిపోయే మట్టి కొంతమేరకు ఇసుకగా మారుతున్నది. దీని వలన సారవంతమైన భూముల్లో ఎడారి భూములు కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో నెట్టింపాడు ఎత్తిపోతలు ప్రారంభం కావడానికి ముందు కృష్ణా, తుంగభద్రా రెండు జీవనదుల మద్య ఉన్న నడిగడ్డ (గద్వాల అలంపూర్) ప్రాంతంలోని గట్టు మండలంలో మట్టి ఇసుకగా మారుతున్న ఎడారి భూములను ఆచార్య జయశంకర్, కేశవరావు జాదవ్, మల్లెపల్లి లక్ష్మయ్యలతో కూడిన మా తెలంగాణ ఉద్యమకారుల బృందం గమనించి అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చిరించింది. రాజస్థాన్‌లోని ధార్ ఎడారి పొరుగున ఉన్న గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దులలో విస్తరించడానికి కారణం కూడా భూమిపపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, కొట్టుకొచ్చే భూమిపై పొరల్లోని మట్టితో సముద్రమట్టం 2050 నాటికి 02-0.5 మీటర్లు పెరగుతుంది. సముద్రతీర పట్టణాలు, గ్రామాలు తరలిపోవాల్సి ఉంటుంది. సముద్రంలోని జలచరాలు, మంచినీటి చెరువుల్లోని చేపలు మరో 30-35 ఏళ్లలో కనిపించకుండా పోనున్నవి.

సారవంతమైన మట్టి (భూమి పైపొర) వేడెక్కడం వలన కలుగుతున్న నష్టాలను పరిశీలస్తే.. భూగర్భ జలాల రీఛార్జ్ తగ్గిపోయి మట్టిలో తేమ అంతరిస్తుంది. ఈ పొరల్లో మట్టికణాలను కలిపి ఉంచే శిలీంద్రాలు, మొక్కల స్నేహితులైన సూక్ష్మజీవులు, ఎర్రలు, ప్రయోజనకారులైన కోట్లాది బ్యాక్టీరియాలు చనిపోతాయి. ఫాస్పరస్ (భాస్వరం) గ్రహణం తగ్గి మట్టి ఆరోగ్యం క్షీణిస్తుంది. మట్టిలోని కార్బన్ స్థాయిలు తగ్గుతాయి. వేడివల్ల సూక్ష్మజీవులు మరింత చురుగ్గా పనిచేసి కార్బన్ను Co2 (కార్బన్ డై ఆక్సయిడ్) గా విడుదల చేస్తాయి. వేడెక్కే మట్టిలోంచి ఆర్గానిక్ కార్బన్ విడుదల పెరగడంతో భూసారం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. భూమి కోత పెరుగుతుంది. ఇది గ్రీన్ హౌజ్ గ్యాసెస్ను మరింత పెంచి గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి కారణం అవుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వలన మట్టి నాణ్యత దెబ్బతిని పంటలు దిగుబడి బాగా తగ్గుతుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ప్రతి పదేళ్లలో ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 1950- 1980 మధ్యకాలంలో మన దేశంలో వర్షాధార ప్రాంతాల్లో వరి దిగుబడులు 20 నుంచి 47% తగ్గగా, గోధుమ పంట 19.3 శాతం నుండి 40 శాతం తగ్గుదల, ఖరీఫ్లో పండే మొక్కజొన్న దిగుబడులు 18.23 శాతం తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భూమికి సంభవిస్తున్న మరో ముప్పు విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు. కలుపు గడ్డి మందులు. సాంప్రదాయకంగా రైతులు శతాబ్దాలుగా పశువుల పేడను, చెరువులు కుంటల్లోని సారవంతమైన మట్టిని పొలాల్లో చల్లేవారు. ఆ రోజుల్లో క్యాన్సర్ వేల మందిలో ఏ ఒక్కరికో వచ్చేది. ఇప్పుడు ఇంటికొక్క క్యాన్సర్ వ్యాధిగ్రస్థుడు ఉంటున్నాడు. మట్టిని విషపూరితం చేస్తే ఆ మట్టి మనకు క్యాన్సర్ వ్యాధినిస్తున్నది. మన భూగ్రహాన్ని కాపాడుకోవడానికి మనకున్న శక్తిని తెలియజేయాలనే సంకల్పంతో ‘మన శక్తి -మన గ్రహం’ థీమ్‌ను 2026వ సంవత్సరానికి ‘ఎర్త్ డే’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఎంపిక చేసింది. ఈ సంవత్సరం పొడవునా భూమి సంరక్షణకోసం సేంద్రీయ వ్యవసాయంకోసం స్వచ్ఛంద సంస్థలు, మన రాష్ట్రంలో ఇటీవలే ఆవిర్భవించిన ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ కార్యకర్తలు ఏడాది పొడవునా ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి. ప్రముఖ స్వామీజీ జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన ‘సేవ్ సాయిల్’ ఉద్యమాన్ని ముందుకు తీసుకునిపోవాలి. నోరులేని మట్టికి, ఆ మట్టిలోని సూక్ష్మజీవులకు మనమే గొంతుక కావాలి. (Become voice of voice less soil and creatures).

- వి. ప్రకాశ్ 

- (రచయిత తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్)