
హార్మూజ్ జలసంధిలో తాజా ఉద్రిక్తతల మధ్య, గత వారం కూడా రెండు భారత నౌకలు ఇరాన్ నౌకాదళ దాడులకు గురైన విషయం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని టెహ్రాన్ హామీ ఇచ్చినప్పటికీ ఈ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ జెండాతో ప్రయాణిస్తున్న ‘జాగ్ అర్నవ్’ అనే బల్క్ క్యారియర్ సౌదీ అరేబియా నుంచి భారత్కు వస్తుండగా దాడికి గురైంది. అలాగే ‘సాన్మార్ హెరాల్డ్’ అనే మరో నౌక ఇరాక్ నుంచి భారత్కు చమురు రవాణా చేస్తుండగా లక్ష్యంగా మారింది. ఏప్రిల్ నెలలో సుమారు పది భారత నౌకలు
ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సమాచారం. ఈ ఘటనలతో ఇరాన్లో అసలు అధికార నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రభావం పెరిగి, రాజకీయ నాయకత్వాన్ని పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి తన ఆందోళనను తెలియజేస్తూ ఇరాన్ రాయబారిని భారత ప్రభుత్వం పిలిపించి వివరణ కోరింది.


