
పొద్దున లేస్తే కెసిఆర్ చావాలని మాట్లాడుతున్నారని.. వాళ్లు వెయ్యి జన్మలు ఎత్తినా తాను చావని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ దళపతి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడే వరకు సేవ చేస్తానని చెప్పారు.
జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. "గతంలో తెలంగాణ అనే పదం పలకడానికే భయపడే రోజులు.. తెలంగాణ పదాన్నే నిషేధించే పరిస్థితులు ఉండేవి. మన నీళ్లు, వనరులను దోపిడీ చేశారు. పాలమూరు వంటి జిల్లాలో 90 శాతం వలసలే. కొన్ని పార్టీల తీరుతో ఆవేశం, బాధ కలిగేవి. మూలిగే నక్కపై తాటిపండులా చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని నిరసన తెలిపితే బషీర్‌బాగ్‌లో కాల్చి చంపారు. బషీర్‌బాగ్ ఘటనతోనే తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమానికి వచ్చా. కెసిఆర్ రాక ముందు రాష్ట్రంలో కరెంట్ సరిగా ఉండేదా?. మేం వచ్చాక 24 గంటల కరెంట్ ఇచ్చాం. మరి ఇప్పుడు ఏమైంది?. ఈ దుర్మార్గులు గెలిస్తే రైతు బంధుకు రాంరాం. దళితబంధుకు జైభీమ్ అంటారని చెప్పా. నేను చెప్పినట్టే జరిగిందా? లేదా?. ఒకేసారి వెయ్యాల్సిన రైతు బంధును ఎకరానికి ఒకసారి వేస్తున్నారు" అని మండిపడ్డారు.

