మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఆర్‌టిసి జెఎసి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తోంది. ఏప్రిల్ 21 అర్ధరాత్రి అంటే 22వ తేదీ మొదటి డ్యూటీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు జెఎసి వెల్లడించింది. దీంతో ఆర్‌టిసి బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. యాజమాన్యం, చర్చలు జరుపడానికి కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని డిపోల్లో ఆర్‌టిసి జెఎసి నేతలు కార్మికులను సమ్మెకు సంసిద్దం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారికంగా ఎటువంటి పిలుపు రాకపోవడం ఉత్కంఠను పెంచుతోంది. ఆర్‌టిసి కార్మికులు కోరుతున్న డిమాండ్లలో ‘ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం’, ‘యూనియన్ల పునరుద్ధరణ’ మినహా మిగిలిన అన్నింటిపై సానుకూలత వ్యక్తం చేసినా, జెఎసి నేతలు మాత్రం తమ పట్టు వీడటం లేదని తెలుస్తోంది.

సమ్మె ప్రారంభమైతే ప్రజారవాణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. లక్షలాది ప్రయాణికులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అద్దె బస్సులతో పాటు పాఠశాల బస్సులను కూడా వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక సమ్మెను నివారించేందుకు కూడా కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు, ఆర్‌టిసి జెఎసి నాయకుల మధ్య సమావేశం జరిగే అవకాశముంది. ఈ చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయా? లేక సమ్మె తప్పదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జెఎసి వెనుక 40 వేల మంది కార్మికుల బలం ఉందని నేతలు తెలిపారు. . కార్మికులంతా ఏకతాటిపై ఉన్నారని, విభజించు పాలించు అనే ధోరణి ప్రదర్శిస్తే సహించేది లేదని,. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని జెఎసి నేతలు అంటున్నారు.