హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీరాముడిని, హిందువుల మనోభావాలు దెబ్బతిసే విధంగా మాట్లాడారని సినీ నటి కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిచారని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు స్వీకరించామని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రామాయణం, హిందువుల జోలికి వస్తే ఊరుకోమని మెచ్చరించారు. ప్రకాశ్ రాజ్ నటించిన సినిమాలో భవిష్యత్‌లో ఎలా ఆడుతాయో చూస్తామని ఘాటుగా విమర్శించారు. సెలబ్రిటీలు హిందూ దేవుళ్లను లక్షంగా చేసుకొని మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిందని చురకలంటించారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రకాశ్ రాజ్‌పై హిందు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.