మన తెలంగాణ/హైదరాబాద్/కాటారం: పాపాల బైరవుడు మళ్లీ రావాలి, ప్రజా పాలన పోవాలి అని ఒక పెద్ద మనిషి అంటున్నారని ఫాంహౌస్‌లో పడుకునే పాపాల బైరవుడు మళ్లీ ఎందుకు రావాలి, లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందని, పాపాల బైరవుడు ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మళ్లీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని కెసిఆర్ భ్రమల్లో ఉన్నారని, ఆ కుటుంబాన్ని ఎప్పటికీ అధికారంలోకి రానివ్వనని సిఎం రేవంత్‌రెడ్డి శపథం చేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఘోరీ కట్టామని, 2029లో కూడా అదే పునరావృతం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కెసిఆర్ నీ ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటానని కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్ అని, 2029లో నువ్వో నేనో తేల్చుకుందామని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. జగిత్యాలలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా వందమీటర్ల లోతు గోతిలో పాతరేసి పాతిపెడతానని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో నిన్ను ఓడగొట్టినా, 2024లో నీకు గుండుసున్నా చేసినా, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్‌లో మీక గోరీ కట్టిన, వచ్చేసారి ఈ ఘోరీ మీ మా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా ఎగురవేస్తారని జయశంకర భూపాలపల్లి కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


వచ్చేసారి కెసిఆర్‌కు

ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తా

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, పార్టీ మారిన జీవన్ రెడ్డిలపై సిఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. జీవన్ రెడ్డి బిఆర్‌స్‌లో చేరడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఒక మాదిగ బిడ్డ అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకనే జీవన్ రెడ్డి పార్టీ మారారని, కాంగ్రెస్ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, కుట్రపూరితంగా బిఆర్‌ఎస్‌లో చేరారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జీవన్‌రెడ్డి చరిత్ర ఆయన వెనుకున్న మచ్చలన్నీ నాకు తెలుసనీ, 40 ఏళ్ల పాటు తన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని, 14 సార్లు కాంగ్రెస్ బి ఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్లిపోయారని, ఓడిపోయినా ఎన్నోసార్లు పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను గౌరవించిందని ఏడాదిపాటు పదవి లేకపోతే జీవన్‌రెడ్డి కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేశారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వచ్చేసారి కెసిఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని, అప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారో చూస్తానని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కొన్ని నెలల్లోనే కూలేశ్వరం అయ్యిందని, తెలంగాణను పదేళ్లు లూటీ చేసిన కెసిఆర్‌ను ఉరి తీసినా తప్పులేదని సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

భ్రమల్లో కెసిఆర్..

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి.శ్రీనివాస్ కలిసి కాంగ్రెస్‌ను ఎలా అధికారంలోకి తెచ్చారో ఇప్పుడు తాను, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిసి రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పాలకుల తీరుపై కెసిఆర్ చేసిన చిల్లర మాటలు అనే విమర్శకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని, వారి తీర్పును గౌరవించకుండా ఇంకా అహంకారంతో మాట్లాడటం కెసిఆర్ భ్రమలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ శకం ముగిసిందని, ఇకపై రాష్ట్రంలో కాంగ్రెస్ హవా మాత్రమే కొనసాగుతుందని సిఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయని, అభివృద్ధి పనులే తమను మళ్లీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో

రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఏడాదిలోపే చేసి చూపించామని, 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.22 వేల కోట్లు వేశామని ఆయన తెలిపారు. గత విడతలో రైతుభరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు వేశామని ఈరోజు రెండోవిడతలో రూ.5,700 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో వేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన గతంలో ఎవరికైనా వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.

45 లక్షల 11 వేల 947

మంది రైతుల ఖాతాల్లో

అనంతరం రైతు భరోసా రెండో విడత నిధులను సిఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. రైతు భరోసా రెండో విడత నిధులను రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. గత నెల 23న మొదటి విడత సాయాన్ని పంపిణీ చేసింది. మొదటి విడతలో సుమారు రూ.3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45 లక్షల 11 వేల 947 మంది రైతుల ఖాతాల్లో రూ.5,563 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.