
హైదరాబాద్: ప్రజలను మరోసారి బిఆర్ఎస్ మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆడబిడ్డలకు మాజీ సిఎం కెసిఆర్ భరోసా ఇవ్వలేదని, మహిళా రిజర్వేషన్లపై ఒక్కమాట మాట్లాడలేదని, ఉద్యమకారులను కనీసం గుర్తు చేసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ సభలో బిజెపిని పల్లెత్తు మాట అనలేదని, బిఆర్ఎస్ ఓటమి ప్రజల ఓటమిగా చెప్పడం సిగ్గుచేటు అని కవిత విమర్శించారు. మంగళవారం సభలో బిఆర్ఎస్ ఉట్టికథలు, కాంగ్రెస్ పిట్టకథలు చెప్పాయని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. ఇళ్లు కూలగొట్టినందుకు అధికారంలో ఉంటారా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ బిఆర్ఎస్ ప్రజలపట్ల లెక్కలేని తనంతో పనిచేస్తుందని, అదే తీరుతో కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం చెరో సభ పెట్టాయని, వెయ్యి ఏళ్లైనా కాంగ్రెస్, బిఆర్ఎస్ మారవని ధ్వజమెత్తారు. ఆర్టిసి సమ్మెకు కవిత తమ మద్దతు తెలిపారు.














