లక్షల్లో వసూలు...ఆపై బోర్డు తిప్పేస్తున్న కన్సల్టెంట్లు

కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న నిందితులు

రోడ్డుపై పడుతున్న నిరుద్యోగులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో ఉద్యోగాలు కోల్పోతున్న వారిని జాబ్ కన్సల్టెంట్లు నిండాముంచుతున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేస్తున్నారు. వందల మంది నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించకుండానే బోర్డు తిప్పేసి నిండాముంచుతున్నారు. ఇటీవల కాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2లక్షలకుపైగా వసూలు చేశారు. కొద్ది రోజులు తమ సంస్థ కార్యాలయంలో శిక్షణ కూడా ఇచ్చారు, తమ సంస్థలోనే ఉద్యోగం ఇచ్చినట్లు అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చా జీతాలు ఇచ్చారు. ఇలా మూడు నెలలు జీతాలు ఇచ్చిన నిందితులు తర్వాత కార్యాలయానికి తాళం వేసి పరారయ్యారు. కామెల్ క్యూ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయాన్ని ఓపెన్ చేసిన నిందితులు 450మంది నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల చొప్పున వసూలు చేశారు. మూడు నెలలు నిరుద్యోగులకు జీతాలు ఇచ్చిన నిందితులు తర్వాత బోర్డు తిప్పేశారు.

దీంతో నిరుద్యోగులు రోడ్డున పడ్డారు, బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు అరెస్టు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జూబ్లీహిల్స్‌లో మరో సంస్థ బోర్డు తిప్పేసింది. పది మంది నిందితులు కలిసి ప్రొఫెషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. లంక నిరుపమ, మామిడి అరుణ్ రాజ్ మరో ఎనిమిది మందితో కలిసి సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. గ్రీస్, ఇటలీ, సెర్బియా వంటి దేశాల్లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. సోషల్ మీడియాలో విస్కృతంగా ప్రచారం చేసుకున్న నిందితులు చాలా మందికి యూరప్ (గ్రీస్/రొమేనియా)లో వర్క్ వీసా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరు వసూలు చేశారు.

డబ్బు తీసుకున్న తర్వాత నిరుద్యోగులకు నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చారు, వాటిని తీసుకున్న బాధితులు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పెట్టినా నిందితులు స్పందించడంలేదు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు గతంలో ట్రివైయల్ చాప్టర్ పేరుతో గతంలో కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మాదాపూర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువగా జాబ్ ఫ్రాడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో నిందితులు ఇక్కడే కార్యాలయాలు ఓపెన్ చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.

ఐటిలో ఒడిదుడుకులు...

ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ వల్ల సాఫ్ట్‌వేర్ రంగంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. పలు సంస్థలు ఉద్యోగులను తీసివేస్తుండడంతో మార్కెట్‌లో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని నకిలీ కన్సల్టెన్సీలు పుట్టుకువస్తున్నాయి. నిరుద్యోగుల అవసరాలను ఉపయోగించుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసి పరారవుతున్నారు. నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న నిందితులు బోర్డులు తిప్పేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారు. ఉద్యోగాల పేరుతో నకిలీ సంస్థలు కోట్లాది రూపాయలు వసూలు చేసి నిరుద్యోగులను నిండాముంచుతున్నారు.