వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, దాహం తీర్చడానికి కొబ్బరి నీరు ఉత్తమమైన సహజ పానీయంగా పరిగణిస్తారు. రోడ్డు పక్కన లేదా మార్కెట్‌లో అనేక రకాల పచ్చి కొబ్బరికాయలు కనిపిస్తాయి. కానీ, ప్రతి కొబ్బరికాయ లోపల తాజా, ఎక్కువ నీరు ఉంటుందని చెప్పలేము. కొన్నిసార్లు తెలియకుండానే చప్పగా లేదా రుచిలేని కొబ్బరికాయను కొనుగోలు చేస్తాం. అయితే, కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించడం ద్వారా తాజా, తీయని నీటితో నిండిన కొబ్బరికాయను కొనవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఎప్పుడైనా పరిమాణానికి బరువుగా అనిపించే కొబ్బరికాయను ఎంచుకోవాలి. బరువుగా ఉండే కొబ్బరికాయలలో నీరు ఎక్కువగా ఉంటుంది. అయితే, తేలికగా ఉండే కొబ్బరికాయలు పొడిగా లేదా తక్కువ నీటితో ఉండవచ్చు.

2. తాజా కొబ్బరికాయ లేత ఆకుపచ్చగా, తాజాగా కనిపిస్తుంది. అందులో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇక కొబ్బరికాయ పసుపు, గోధుమ రంగులో లేదా పొడిగా కనిపిస్తే, అది పాతది కావచ్చు. అందులో నీరు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

3. కొబ్బరికాయను కొనుగోలు చేసేటప్పుడు మెల్లగా ఊపండి. లోపల నీటి శబ్దం మీకు స్పష్టంగా వినిపిస్తే, అందులో తగినంత నీరు ఉందని అర్థం.

4. కొబ్బరికాయ ఉపరితలంపై ఏదైనా మెత్తటి లేదా కుంగిపోయిన భాగం ఉంటే అది పాడైపోయి ఉండవచ్చు. అందులో నీరు తక్కువగా ఉంటాయి. అటువంటి కొబ్బరికాయలను కొనుగోలు చేయడం మానుకోవాలి.

5. గుండ్రంగా, సమతుల్యంగా ఉన్న కొబ్బరికాయ ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మరీ కొబ్బరికాయ పొడవుగా లేదా వంకరగా ఉన్న వాటిలో కొన్నిసార్లు నీరు తక్కువగా ఉంటుంది.