మాజీ మంత్రి గంగుల కమలాకర్ అరెస్ట్

బిజెపి, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. దాదాపు వందమంది అదుపులోకి

కరీంనగర్‌లో రాజకీయ ఉద్రిక్తత మరింత ముదిరింది. నగర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. గంగుల నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన గంగుల కమలాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “బీజేపీ డౌన్ డౌన్”, “బండి సంజయ్ డౌన్ డౌన్” అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనవసరంగా దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా మహిళా కార్యకర్తలను లేడీ పోలీసుల్లేకుండానే అదుపులోకి తీసుకున్నారంటూ బిఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.

మహిళలను బలవంతంగా ఈడ్చుకెళ్లారని ఆరోపిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, బిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించారు. బంద్ పిలుపు నేపథ్యంలో గంగుల కమలాకర్ నివాసం వద్దకు చేరుకున్న బిఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు వందమందికి పైగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు వారిని తరలించినట్లు తెలిసింది. ఇక గంగుల కమలాకర్ అరెస్టును బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కును ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కరీంనగర్ నగరమంతా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.