
“ఎన్నికలైపోయినాక ఒక విషాదాంత ప్రహసనం ముగిసిపోయినట్టుంటుంది... దేశం పరాయివాడి పాలనలోకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది... మనల్ని ఎవరో వెక్కిరిస్తున్నట్టు, ఎవరో మనల్ని చూసి నవ్వినట్టుంటుంది... మన మీద మనకే అసహ్యం వేస్తుంది... కొంత రోత పుడుతుంది. మన బుద్ధి గడ్డి తింటున్నదని తెలిసి సిగ్గేస్తుంది. ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన మీదట, పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత తుపాకీ ఇంకా మనకే గురిపెట్టి వుందని తెలుస్తుంది. మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది. ఈ మొహం మరో అయిదేళ్ల వరకు ఎవరికీ చూపించలేం గదా అనిపిస్తుంది. దిగులేస్తుంది.” మహానుభావుడు కెఎన్‌వై పంతంజలి నాలుగు దశాబ్దాల కింద (ఉదయం దినపత్రిక, 29.12.1984) అన్న అక్షర సత్యమైన మాటలివి. పరిస్థితిలో ఇప్పుడు పెద్దగా మార్పేమీ లేదు. అదే భావన అత్యధికుల్లో! సదరు ఎన్నికలకు ముందు కొన్ని సర్వేలు, పరిశీలనలు, అంచనాలు వస్తుంటాయి, మరి వాటి పరిస్థితేంటి? అసలు ఫలితాలు వచ్చాక ప్రతి సర్వే సంస్థ విశ్లేషించుకోవాలి! తమ అంచనాలు కరెక్టయితే అవి ఎలా వచ్చాయి? శాస్త్రీయ పద్ధతుల్ని స్థిరీకరించాలి. తప్పయితే ఎక్కడ, ఎలా లెక్క తప్పింది? సమీక్షించుకోవాలి. సర్వే సంస్థలేవైనా ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలి. దేశమంతా చర్చ జరుగుతున్న సందర్భమిది!
ఇటీవలి 5 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు దేశంలో ఉత్కంఠ రేపాయి. ప్రతి ఎన్నికలలో ఏదో ఒక ఆశ్చర్యం ఉండింది. కానీ, తాజా ఎన్నికల ఫలితాలు మరొక పార్శ్వాన్ని ఎత్తి చూపాయి. సాధారణంగా ప్రతి ఎన్నికల్లో పోలింగ్ అయిపోయినాక అనేక సంస్థలు, వ్యక్తులు వారికున్న సమాచారం, సేకరించిన జనాభిప్రాయం, రాజకీయ అవగాహనల్ని బట్టి ఎన్నికల ఫలితాలు ముందస్తుగా ఊహించి అంచనాల్ని వెల్లడిస్తారు. ఎగ్జిట్ పోల్స్‌గా చలామణీ అయ్యే ఇందులో అన్నీ ‘ఎగ్జిట్ పోల్స్’ కావు. వివిధ పద్ధతుల్లో జనాభిప్రాయాల్ని సేకరించడం ద్వారా పలికే ఈ భవిష్యవాణులు కూడా వేర్వేరు శాస్త్రీయ పద్ధతులు అనుసరించే చేస్తారు. అనూహ్యంగా ఇటీవలి ఎన్నికల్లో ఫలితాలను దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ పక్కాగా ఊహించడంలో గతి తప్పాయి. అంకెల్లో హెచ్చుతగ్గులు ఎప్పుడూ ఉండేవే అయినా ఈసారి మాత్రం పలు సర్వే సంస్థలు ఫలితాల దిశను తప్పడం గమనార్హం. ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు తుది ఫలితాలు, అంతకు ముందు వచ్చిన వివిధ ఎగ్జిట్ పోల్ ఫలితాల మధ్య భారీ తేడా చూడవచ్చు. ఇది కేవలం అంకెలలో తేడాగా కొట్టి పారేయలేము. ఓటర్ల నాడిని ఎంతో కొంత, ఏదో రకంగా ముందుగానే పసిగట్టే సేఫాలజిస్తులు ఈ సారి ఘోరంగా విఫలమయ్యారు. దీనికి కారణాలు ఏమై ఉండవచ్చు? ఆసక్తి కలిగించే ఈ అంశాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరముంది.
పరిమితులొక అడ్డంకి
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం... మొత్తం అయిదు అసెంబ్లీలకు జరిగిన (2026) ఎన్నికల్లో కేరళ, అసోం, పుదుచ్చెరి విషయంలో సర్వే అంచనాలు తుది ఫలితాలతో చాలావరకు సరిపోలాయి. ఎటొచ్చీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాలను కచ్చితంగా అంచనా వేయడంలో విఫలమయ్యాయి. సర్వే పద్ధతిపరమైన పరిమితులూ కారణం కావచ్చు. నమూనాలు తక్కువ సంఖ్య నుండి సేకరించడం, ఫోన్ ద్వారా సేకరణ, సమయం, ప్రాంతం వగైరాలన్నీ పద్ధతుల పరమైనవి. ఇదివరకు తమ రాజకీయ అవగాహన జోడించి ఈ పరిమితులను సర్వే నిర్వాహకులు అధిగమించేవారు. సగటు ఓటరు అక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పారదర్శకంగా స్పందించకపోయి ఉండవచ్చు. అందువల్లే జనం నాడి దొరికి ఉండదు. ఫలితంగా నిర్దిష్ట స్థానిక సమస్యల ప్రభావాన్ని తప్పుగా అంచనా వేయడం, రాజకీయ నవనాల్లో స్వాభావిక అంచనాలు తప్పడానికీ కారణం కావచ్చు. జనం స్పందనలో ఖచ్చితత్వం లోపించడంవల్ల ప్రభుత్వ వ్యతిరేకత దొరకదు. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని పసిగట్టడంలో సర్వేలు విఫలమయ్యాయి.
ఈ మధ్య ఏకఛత్రాధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఒడిశా, కేరళ, బెంగాల్ లో ఓట్లు పడ్డాయి. అవినీతి, కుంభకోణాలు (టీచర్ల నియామకాలు, బదిలీలు), మహిళల భద్రత (ఆర్.జి.కర్ కేసు తర్వాత), గూండాయిజం వంటి అంశాలు బెంగాల్‌లో బహుశ ‘మార్పు ఆకాంక్ష’ను సృష్టించాయి. మరి, ఇవి ఎగ్జిట్ పోల్స్‌లో ఎందుకు కానరాలేదు? నమూనా ఓటర్ల అభిప్రాయాలలో ఇది ప్రతిబింబించలేదు. ఎందువల్ల? ఓటర్లు ఎందుకు చెప్పలేదు? భయమా? ఎందుకు బయటపడాలని మౌనం పాటించడమా? ఒక సర్వే సంస్థ ఇదే కారణంతో ఆఖరు నిమిషంలో తమ అంచనాల వెల్లడిని ఆపేసింది. తమిళనాడు జనం నాడిని బాగా పసిగట్టిన ‘యాక్సిస్ మై ఇండియా’ సినీతార విజయ్ నేతృత్వపు టివికె 98 నుంచి 120 స్థానాలు గెలుస్తుందని సరిగ్గా అంచనా వేసింది. టివికె 108 స్థానాలు గెలిచింది. అదే సంస్థ పశ్చిమ బెంగాల్ విషయంలో అంచనాలు ప్రకటించలేదు. ‘మేం వంద మందిని కదిలిస్తే 80 మంది మాటాడలేదు, ఏ అభిప్రాయం చెప్పలేదని, తుది అంచనాల వెల్లడికి నిరాకరించింది.
ఓటర్ ప్రక్షాళనా (సర్) కారణమేనా?
ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ద్వారా సుమారు 90 లక్షల మంది ఓటర్ల (మొత్తం ఓటర్లలో దాదాపు 12%) తొలగింపుతో ఏర్పడ్డ పరిస్థితిని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్ సర్వేలు విఫలమయ్యాయి. ఇది తమ ఓటు బ్యాంకును హరించిందని తృణమూల్ వాదించినా, బిజెపి కొత్త ఓటర్లను, మతువా వర్గాన్ని విజయవంతంగా సమీకరించింది. బంగ్లా చొరబాట్లను చూపించి హిందూత్వ సానుకూల ఓట్లను ప్రోదిచేసింది. సాంప్రదాయ నమూనా సేకరణలో, జనాభిప్రాయ వ్యక్తీకరణలో ఈ మార్పు అంతగా నమోదయినట్టులేదు. “సురక్షిత” ప్రాంతాలలో నమూనా పక్షపాతం కొంత కారణమై ఉంటుంది. అధిక రాజకీయ అస్థిరత, అధికార పార్టీకి క్షేత్రస్థాయి పట్టున్న చోట్లలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే కొన్ని సంస్థలు తక్కువ నమూనాలను సేకరిస్తుంటాయి. ఇది, అధికారంలో ఉన్నవారి పనితీరును ఉన్నదానికన్నా అధికంగా అంచనా వేయడానికి, వ్యతిరేకతను తక్కువ చేసి చూడటనికీ దారితీస్తుంది.
అధిక ఓటింగ్ శాతం, పరిస్థితుల్ని బట్టి తుది ఫలితాల్లో ఏకరీతిన కాక విభిన్నంగా ప్రతిబింబిస్తుంది. రికార్డు స్థాయిలో 92.93% ఓటింగ్ శాతం నమోదైంది. పెద్ద సంఖ్యలో తొలిసారి ఓటు వేస్తున్న వారిని, గతంలో నిరాసక్తంగా ఉన్న పౌరులను పోలింగ్ బూత్‌లకు తీసుకువచ్చింది. ‘సర్’ తొలగింపుతోపాటు, జరుగుతున్న ‘తొలగింపు’ల భయం కారణంగా ఎక్కడెక్కడో ఉన్నవారినీ పరుగెత్తుకు వచ్చి ఓటు వేసేలా చేసింది. ఎన్నికలకు ముందు అభిప్రాయ సేకరణ నమూనాలలో వీరికి ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉండదు, ఉన్నా తక్కువ. సర్వే సంస్థ నమూనాల్లో ఉండి, సుప్రీంకోర్టు ఇచ్చే తీ(ఓదా)ర్పు ద్వారానైనా తాము ఓటేస్తామనుకున్న సుమారు 27లక్షల మందికి ఓటింగ్ చాన్స్ రాలేదు.అంచనాలుతుది ఫలితాల మధ్య వ్యత్యాసానికి ఇదీ కారణమై ఉంటుంది.
ఓటర్లు, ఒపీనియన్ మేకర్స్ వేర్వేరు
తమిళనాడులో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకె నేతృత్వంలోని కూటమి ఆధిక్యతను ఊహించి, సీట్ల సంఖ్య అతిగా అంచనా వేసి, కొత్తగా రంగప్రవేశం చేసిన టివికె (తలపతి విజయ్ పార్టీ) ప్రభావాన్ని తక్కువగా లెక్కగట్టాయి. ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రత్యక్ష ఓటర్ల కన్నా, ముఖ్యంగా యువమహిళా ఓటర్ల కన్నా పరిమితంగా ఉండే ‘ఒపీనియన్ మేకర్స్’ అభిప్రాయమే (నమూనా నిష్పత్తి వల్ల) సర్వేల్లో ప్రతిబింబించి ఉండొచ్చు! విజయ్‌ను తక్కువ అంచనా వేయడానికి...స్వాభావిక ఆలోచనలు, రాష్ర్టంలో ఆరు దశాబ్దాలుగా కొత్త పార్టీలకు దొరకని అవకాశాలు, సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చినా ఇటీవల పెద్దగా ప్రభావం చూపకపోవడం వంటివి కారణాలు కావొచ్చు. ‘కరూర్’ తొక్కిసలాట, 41 మంది మృతి తర్వాత ర్యాలీలు, సభల్ని విజయ్ తగ్గించడం, విజయ్ సభలకు వచ్చిన జనం మీద మీడియాలో తగిన విశ్లేషణలు లేకపోవడం, ఎపిలో ‘పవన్ కళ్యాణ్’ తరహా అభిమానంగా కొట్టిపారేయడం... వంటివీ అంచనాలు తప్పడానికి కారణం కావచ్చు.
ఓటు వాటా శాతాలను బట్టి విజయ మార్జిన్‌లను అతిగా లెక్క వేసి, సీట్ల సంఖ్య తక్కువగా పరిగణించడం పొరపాటుకు తావిచ్చింది. తమిళనాట ఎగ్జిట్ పోల్స్, గెలిచే కూటమికి పెద్ద మార్జిన్‌ను అంచనా వేస్తుంటాయి. 2021లో, అవి డిఎంకె 175- 195 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా, వాస్తవ సంఖ్య 159 మాత్రమే! 2026లో కూడా, ఇలాంటి అతి ఆశావాదమే బోల్తా కొట్టి ఉంటుంది. ద్రవిడ ఉద్యమ ప్రభావం సన్నగిల్లడం రెండు సంప్రదాయ ద్రవిడ పార్టీలు డిఎంకె, అన్నాడిఎంకె లను కాదని, విజయ్ వైపు ఓటర్ల నిశ్శబ్ద మొగ్గుకు కారణమై ఉండొచ్చు. ఎక్కువ చోట్ల గట్టి ముక్కోణపు పోటీల వల్ల విజేతల మార్జిన్‌లు తగ్గటం, వీటివల్లే సర్వే అంచనాలు తారుమారుకు ఆస్కారం ఏర్పడింది. తమిళనాడైనా, బెంగాలైనా... ఓడిపోతోందనో, వివాదాస్పదమనో భావించే పార్టీకి బహిరంగ మద్దతుకు ఓటర్లు వెనుకాడవచ్చు. భయం, సిగ్గు వంటి కారణాల వల్ల ఓటరు స్పందనలో నిజాయితీ తగ్గింది. ఓటింగ్ జరిగిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ నిర్వహణకు ఒకప్పటిలా సానుకూలత లేని సంక్లిష్టత ఇప్పుడు నెలకొంది. ముందే జనాభిప్రాయం తీసుకొని, దానికి ‘ఎగ్జిట్ పోల్’ అని పేరు తగిలిస్తున్నారు. ఓటర్ల నిర్ణయాల్లో చివరి నిమిషపు మార్పుల్ని, ఆఖరు నిమిషంలో జరిగే ప్రచార ప్రలోభ కార్యక్రమాల ప్రభావాన్ని అప్పుడివి గుర్తించలేవు.
పుట్టగొడుగుల్లా సర్వే సంస్థలు
సర్వేల్లో ఏ పద్ధతులు అనుసరిస్తున్నారు? నమూనా పరిమాణం ఎంత? సర్వే ఎక్కడ? ఎప్పుడు (ఏయే తేదీల మధ్య) నిర్వహించారు? ఆర్థిక వనరులెక్కడివి? అన్నీ పారదర్శకంగా ఉండాలనే డిమాండ్ వస్తోంది. ఇవన్నీ ముందుగానే ఆన్‌లైన్‌లో ప్రకటించాలి. అప్పుడు బోగస్ సర్వే సంస్థలు, వ్యాపార దృక్పథంతో ఉన్నవి, స్వతంత్య్రమనే ముసుగులో రాజకీయ పార్టీలకు అనుకూలంగా/ ప్రతికూలంగా పనిచేస్తున్నవీ అన్నీ ఎగిరిపోతాయి. ఈ ఆరోగ్యకర చర్చను లేవనెత్తడంతోపాటు దేశంలో ఎగ్జిట్ పోలింగ్‌తో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను ఈ రెండు రాష్ట్రాల ఎన్నిక ఫలితాలు ఎత్తి చూపాయి. నమూనా పరిమాణం ఎక్కువుంటే ఖచ్చితత్వం అనే వాదనా తప్పే! ఓటర్లలో ఉన్న వైవిధ్యం సంక్లిష్టం. పెద్ద నమూనా పరిమాణాలతో తీసుకున్నా కూడా నిర్దిష్ట వర్గాల (పశ్చిమ బెంగాల్‌లోని మతువా వర్గం లేదా తమిళనాడులోని నిర్దిష్ట కుల సంబంధాలు వంటివి) సూక్ష్మభేదాలను పట్టుకోవడం కష్టం. ఒక మెగా నగరంలోని సంక్లిష్టత ఇక్కడ కూడా ప్రతిబింబించింది. ఇటీవల ముంబై మునిసిపల్ ఎన్నికలలో శివసేన భారీ స్థాయిలో ఓడిపోవడం, ఎవరికీ అంచనాలు లేకపోవడం ఒక ఉదాహరణ. వెరసి, ఎగ్జిట్ పోల్ శాస్త్రీయ పద్ధతులు “వైఫల్యం” అనే భావనకు దారితీసింది. మరి, ఎగ్జిట్ పోల్ శాస్త్రీయ పద్ధతుల మీద చర్చ చేద్దామా? కొత్త పద్ధతుల మీద పరిశోధనకు ఈ వైఫల్యం ఒక దిక్సూచిగా మారవచ్చు.
దిలీప్‌రెడ్డి
(డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)
దొంతి నర్సింహారెడ్డి
(పాలసీ ఎనలిస్ట్, సలహాదారు సిజిఆర్)













