రాష్ట్రంలో ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. మే 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మా విభాగాల హాల్‌టికెట్లు అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఇంజినీరింగ్ అభ్యర్థులు కూడా తమ హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 4, 5 తేదీల్లో జరిగే అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షకు 106, మే 9 నుంచి 11 వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి ఏప్రిల్ 22 వరకు 2,10,308 మంది, అగ్రికల్చర్ విభాగానికి 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.