
కేరళలో ఓట్లు లెక్కించిన తర్వాత వెలువడిన ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు.. అవి భారత రాజకీయ చరిత్రలో ఒక మహా అధ్యాయానికి తెరపడ్డాయి. పినరయి విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. దశాబ్దం పాటు కొనసాగిన పరిపాలనకు ముగింపు పలికింది. కానీ ఈ ఓటమి అంటే కేవలం ఒక పార్టీ అధికారం కోల్పోవడం కాదు. 1977 నుండి భారతదేశంలో కనీసం ఒక్క రాష్ట్రమైనా కమ్యూనిస్టు పాలనలో ఉండేది. ఇప్పుడు ఆ స్థితి మొదటిసారి మారిపోయింది. స్వాతంత్య్రానికి పూర్వం అంకురించి, స్వాతంత్య్రానంతరం పల్లవించి, కోట్లాది కార్మికులకు, రైతులకు ఆశాజ్యోతిగా నిలిచిన ఎర్రజెండా.. ఇప్పుడు ఏ అధికార సౌధంపైన ఎగరడం లేదు. కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో కేవలం పార్టీ రాజకీయంగా మాత్రమే ప్రారంభం కాలేదు. అది ఒక సామాజిక చలనంగా, వర్గపోరాటంగా, జీవన విధానంగా పుట్టింది.
1946 నుండి 1951 వరకు తెలంగాణలో సాయుధ రైతు పోరాటాన్ని నడిపించింది, భూస్వాములకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించింది. 1950లు, 1960లలో భారత పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని అలంకరించింది. అత్యంత చారిత్రాత్మకమైన ఘట్టం 1957లో జరిగింది. కేరళ ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా. ఆ ప్రభుత్వం భూసంస్కరణలు, విద్యా సంస్కరణలను అమలు చేసింది. స్వతంత్ర భారతదేశంలో అన్ని రాజ్యాంగ విలువలకు లోబడి, శాంతియుతంగా అధికారంలోకి వచ్చిన మొదటి వామపక్ష ప్రభుత్వం అది. జాతీయ స్థాయిలో వారి శిఖరం ఏమిటంటే.. 2007లో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ముందుకు వెళ్ళినప్పుడు, భారత పార్లమెంట్ దిగువ సభలో 62 స్థానాలతో కమ్యూనిస్టులే ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థితిలో ఉన్నారు. ఒక అగ్రరాజ్యానికి సంకేతం పంపగల శక్తి వారి చేతిలో ఉంది.
2004 లోక్‌సభ ఎన్నికల్లో 43 స్థానాలు గెలుపొందడం వారి జాతీయ రాజకీయ శిఖరం. అయితే ఆ అణు ఒప్పందంపై మద్దతు ఉపసంహరణే వారి పతనానికి ఒక పెద్ద మలుపు అయింది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఆ నిర్ణయం.. జాతీయ రాజకీయంలో వారి ప్రభావం అత్యున్నత స్థాయిలో ఉన్న తరుణంలో క్రమంగా వారిని అప్రాసంగికతవైపు నెట్టింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగింది అత్యంత విషాదకరం. వామపక్షాల నేతృత్వంలో లెఫ్ట్‌ఫ్రంట్ పశ్చిమ బెంగాల్‌ను 34 సంవత్సరాలు నిరంతరంగా పాలించింది. ఇది ప్రపంచంలో ఎక్కడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం అత్యధిక కాలం పాలన చేసిన రికార్డు. కానీ 2011లో మమతా బెనర్జీ తుఫాన్ ముందు ఆ కోట కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో 2011 ఓటమి తర్వాత వామపక్షాలు మళ్ళీ తలెత్తుకోలేకపోయాయి. ఇప్పుడు అక్కడ వారు అంచులకు నెట్టివేయబడిన శక్తిమాత్రమే.
త్రిపురలో 1993 నుండి 2018 వరకు వామపక్షాలు పాలించాయి. 2018లో బిజెపి కూటమి ముందు నిలువలేకపోయాయి. కేరళ మాత్రం ఒక ఆశాదీపంగా మిగిలింది. అక్కడ ఐక్యప్రజాతంత్ర సంఘటన, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన మధ్య ఊగిసలాడే రాజకీయం కమ్యూనిస్టులను జీవంగా ఉంచింది. కానీ ఇప్పుడు ఐక్యప్రజాతంత్ర సంఘటన 140 స్థానాలకు గాను 98 స్థానాల్లో గెలుపొందింది. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన కేవలం 35 స్థానాలకు పరిమితమైంది. పార్లమెంటరీ కమ్యూనిజం పతనమవుతున్న సమయంలోనే, అడవుల్లో సాయుధ విప్లవం కలగన్న మావోయిస్టు ఉద్యమం కూడా దాదాపు అంతరించే దశకు చేరుకుంది. ఒకవైపు ఎన్నికల రాజకీయంలో కమ్యూనిస్టులు ఓడిపోవడం, మరోవైపు అడవుల్లో సాయుధ విప్లవకారులు లొంగిపోవడం.. ఈ రెండు పరిణామాలు ఒకే సమయంలో జరగడం కాకతాళీయం కాదు. భారతదేశంలో వామపక్ష ఆదర్శం రెండు రూపాల్లోనూ ఏకకాలంలో వెనుతిరుగుతోంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు తమ భావజాల అప్రాసంగికత సమస్యను ఎదుర్కొన్నాయి. భారతంలో కూడా ఆర్థిక సరళీకరణ తర్వాత మధ్యతరగతి ఆకాంక్షలు, యువత అభీష్టాలు మారిపోయాయి.
ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్యూనిస్టు భావజాలం క్రమంగా ఆకర్షణ కోల్పోవడం వారి ఎన్నికల ప్రాతినిధ్యం తగ్గడానికి దోహదపడింది. మార్క్సిస్టు సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజాస్వామ్య విప్లవం ద్వారా భారత సమాజాన్ని పరివర్తన చెందించాలనేది పార్టీ ఆశయం. ఆ ఆశయం నేటికీ కాగితాలపై ఉంది. కానీ ప్రజల హృదయాలలో స్థానం కోల్పోవడమే అసలు సమస్య. పార్టీ ముందు ఉన్న ఎంపికలు రెండే.. పరివర్తన లేదా పతనం. భావజాలాన్ని వదలకుండానే నేటి యువత, నేటి సమస్యలతో అనుసంధానం చేసుకోవడం అవసరం. కార్మిక హక్కులు, వాతావరణ సంక్షోభం, కార్పొరేట్ ఆధిపత్యం, ఆదివాసీ హక్కులు.. ఇవి నేటి తీవ్ర సమస్యలు. వాటిలో ముందు నిలబడగలిగితే, కమ్యూనిస్టులు మళ్ళీ అర్థవంతులు కాగలరు. ఎన్నికల రాజకీయంలో కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేరు. అడవుల్లో సాయుధ విప్లవకారులు లొంగిపోతున్నారు.
రెండు దారులలో ఉన్న ఓటు మార్గం, తుపాకీ మార్గం.. రెండూ ముగింపుకు వస్తున్నాయి. ఇది నిజంగా భారత్‌లో వామపక్షానికి కాలం చెల్లిన అధ్యాయమేనా? సమాధానం అంత సరళంగా లేదు. 1957లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని నెహ్రూ రద్దు చేసినప్పుడు, ఒక నేత అన్నారట: ఈ ఓటమి తాత్కాలికం - ఆశయం శాశ్వతం. ఆ మాటలు నేటికీ సత్యమే. కానీ ఆశయం మాత్రమే ఉంటే సరిపోదు.. ఆ ఆశయాన్ని నేటి భాషలో, నేటి సమాజానికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే నాయకత్వం కావాలి. ఎర్రజెండా వెలిసింది.. కానీ అది తుడిచిపెట్టుకుపోలేదు. దానిని మళ్ళీ రగిలించగలరా అన్నది కమ్యూనిస్టులు తమకు తాముగా సమాధానం చెప్పుకోవలసిన ప్రశ్న. చరిత్ర అవకాశం ఇస్తుంది, కానీ ఆ అవకాశాన్ని అందుకోవడానికి ఆత్మవిమర్శ, పరిణామశీలత అత్యవసరం. ఒక యుగం ముగిసింది. కొత్త అధ్యాయం మొదలవుతుందో లేదో, కాలమే చెప్పాలి.
- కాలగిరి శ్రీనివాస్‌రెడ్డి
90101 28884















