
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు హోంశాఖ లేఖలు
మావోయిస్టుల అధ్యాయం దాదాపుగా ముగియడంతో కీలక మార్పుల దిశగా కేంద్రం అడుగులు
తెలంగాణ నక్సల్ రహిత రాష్ట్రమని ఇప్పటికే ప్రకటించిన డిజిపి
మన తెలంగాణ/హైదరాబాద్: నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన మావోయిస్టు అధ్యాయం దాదాపుగా ముగియడంతో, పోలీసు శాఖలో చారిత్రక మార్పులకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టు ల పాలిట సింహస్వప్నంగా నిలిచిన కమాండో దళం గ్రేహౌండ్స్, నిఘా విభాగం ఎస్‌ఐబిలను క్రమంగా రద్దు చేసే ప్రక్రియ మొదలయినట్లు తెలుస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై పోరాటం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలను ర ద్దు చేయాలని కేంద్ర హోం శాఖ అన్ని ప్రభావి త రాష్ట్రాలకు ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచా రం.
ఇన్నేళ్లుగా ఈ విభాగాల కోసం ఇస్తున్న ప్ర త్యేక నిధులను కూడా నిలిపివేస్తున్నట్లు అనధికారికంగా తెలిపినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు లేనప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు అనే ప్ర శ్న ఉన్నతస్థాయి భద్రతా సమీక్షలో తలెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం నలుగురు మా వోయిస్టులు మాత్రమే మిగిలారని, రాష్ట్రం మా వోయిస్టు రహిత రాష్ట్రం అని డిజిపి ఇప్పటికే ప లుమార్లు మీడియా సమావేశంలో చెప్పిన విషయాల నేపథ్యంలో కేంద్రం రాసినట్లు చెపుతు న్న లేఖకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
37 ఏళ్లుగా కొనసాగుతున్న గ్రేహౌండ్స్
నక్సలైట్ల ప్రభావం భారీగా ఉన్న క్రమంలో వా రిని ఎదుర్కొనేందుకు ఒక ప్రతేక్యమయిన దళం అవసరమని వచ్చిన ఆలోచనకు ప్రతి రూపమే 37 సంవత్సరాలుగా కొనసాగుతున్న కమాండో దళం గ్రేహౌండ్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కె.ఎస్.వ్యాస్ అనే ఐపిఎస్ అధికారి 1989లో నక్సలైట్ల గెరిల్లా యుద్ధతంత్రాన్ని అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు ఈ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ శివారులో 700 ఎకరాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రేహౌండ్స్‌లోకి నూతనంగా పోలీస్ శాఖలో చేరు వారి ఆసక్తి కలిగిన వ్యక్తులను ఎంపిక చేసి గ్రేహౌండ్స్ కమాండోలుగా కఠినమయిన శిక్షణ ఇస్తారు.
ఈ శిక్షణలో నక్సలైట్లు అడవుల్లో ఉండి పోలీసులపై దాడులు జరిపే తీరు, వాతావరణ వరణ పరిస్థితులు తట్టుకునేలా కమాండోలకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఆరు రోజులు అడవుల్లోనే ఉండి, రోజుకు 20 కి.మీ. ఆయుధాలతో నడిచేలా, రాత్రింబవళ్లు తేడా లేకుండా పోరాడేలా తర్ఫీదునిస్తారు. కఠిన శిక్షణ, విధులతో పాటు జీతాలు కూడా అధికంగా వస్తాయి. గ్రేహౌండ్స్‌లో పనిచేసే సిఐ నుంచి కింది స్థాయి సిబ్బందికి 60శాతం, డిఎస్‌పి పై స్థాయి వారికి 50 శాతం అదనపు వేతనం లభిస్తుంది. దీంతో పాటు విధుల్లో గాయపడితే వైద్యం పూర్తి ఖర్చు ప్రభుత్వానిదే. వీరమరణం పొందితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం, పదవీ విరమణ వయసు వరకు పూర్తి జీతం అందచేస్తారు.
కనిపించని నిఘా నేత్రం ఎస్‌ఐబి
మావోయిస్టుల సమాచారం సేకరించడంతో ఎస్‌ఐబి (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) పాత్ర చాల కీలకంగా ఉంటుంది. కనిపించని నిఘా నేత్రంగా రహస్య సమాచార వ్యవస్థతో అడవుల్లోని మావోయిస్టుల అగ్రనేతల కదలికలు, ప్లీనరీ సమావేశాల వివరాలు ముందే సేకరిస్తుంది. ఈ సమాచారం ఆధారంగానే గ్రేహౌండ్స్ చేపట్టే ‘ఆపరేషన్స్’ విజయవంతం అయ్యేవి. నక్సలైట్ల రహిత రాష్ట్రంగా ప్రకటించడంతో ప్రస్తుత ఎస్‌ఐబి మనుగడ ప్రశ్నార్దకంగా మారనుంది.
అస్తమించిన ఉద్యమం
పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ గ్రామంలో రైతు తిరుగుబాటు ఫలితంగా చారు మజుందార్, కాను సన్యాల్, జంగల్ సంతాల్ నాయకత్వంలో నక్సలైట్ల ఉద్యమం 1967లో మొదలై, 1980లో పీపుల్స్‌వార్‌గా, 2004లో మావోయిస్టు పార్టీగా మారిన ఉద్యమం, వరుస ఎన్‌కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాట్లతో కునారిల్లింది. 2005లో 500 మందికి పైగా ఉన్న కేడర్, నేడు నలుగురికి పరిమితమైంది. రాష్ట్రానికి పట్టిన చీడగా భావించిన మావోయిస్టు ఉద్యమం కనుమరుగవడం శుభపరిణామమే అయినా, దానిని అంతం చేసిన గ్రేహౌండ్స్, ఎస్‌ఐబి వంటి వ్యవస్థలు కూడా చరిత్రలో కలిసిపోయే పరిస్థితి వస్తే ఒక శకం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.














