ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో ఆర్‌సిబి స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఫామ్‌లో చెలరేగిపోతున్నాడు. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి ఓడినప్పటికీ.. భువీ మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) రేసులో ఎస్ఆర్‌హెచ్ బౌలర్ ఇషాన్ మలింగా(15 వికెట్లు)ను వెనక్కి నెట్టి భువనేశ్వర్ (17 వికెట్లు) అగ్రస్థానానికి చేరాడు.

అంతేకాక.. భువీ ఈ మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై 200 ఐపిఎల్ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా భువీ రికార్డు సాధించాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను ఔట్ చేయడంతో భువనేశ్వర్ ఈ ఘనతను అందుకున్నాడు. భువీ తర్వాతి స్థానంలో చాహల్ (186 వికెట్లు) ఉన్నాడు. పలు ఐపిఎల్ సీజన్లు యుఎఇ, దక్షిణాఫ్రికా వేదికలుగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఓవరాల్‌గా ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్(228 వికెట్లు) మొదటిస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో భువనేశ్వర్ 215 వికెట్లతో ఉన్నాడు.