
నటుడిగా కెరీర్ ప్రారంభించి, టాలీవుడ్ బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట ఇప్పుడు పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. ఆయన ముద్దుల కుమార్తె జనని బండ్ల నిశ్చితార్థ వేడుక ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. సూర్యతేజ చిలుకూరితో జనని వివాహం నిశ్చయమైంది. ఈ ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని కాబోయే దంపతులకు తమ ఆశీస్సులు అందించారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నారా చంద్రబాబు నాయుడు లాంటి దిగ్గజాలు విచ్చేయడంతో ప్రాంగణం కళకళలాడింది. వీరితో పాటు ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మైత్రీ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తదితరులు పాల్గొని వేడుకకు మరింత వన్నె తెచ్చారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వివాహ తేదీకి సంబంధించిన అధికారిక వివరాలను బండ్ల గణేష్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.











