తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా, మద్నూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవాలు అంగరంగ వైభోగంగా నిర్వహించారు. రథం గల్లి లోని లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం నుంచి భారీ రథాన్ని శుక్రవారం రాత్రి పాత బస్టాండ్ వద్ద ఉన్న హనుమాన్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం కుస్తీ పోటీలు, మహా అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామంలో జాతర సందడి నెలకొంది.
ఈ రథోత్సవాలకు సమీప గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.












