
చెన్నై: తమిళనాడులో తదుపరి ప్రభుత్వ స్థాపనకు టివికె అధినేత విజయ్‌కు రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ శనివారం రా త్రి అనుమతిని ఇచ్చారు. దీనితో ఎన్నికల తరువాత నెలకొన్న రాజకీయ అధికార అనిశ్చితి వీడింది. విజయ్ సారథ్యంలో ప్ర భుత్వం ఆదివారం ప్రమాణస్వీకారం చేయనుందని వెల్లడైంది. ఈసారి సరైన సమగ్ర సంఖ్యాబలంతో 120 మంది ఎమ్మెల్యేల సంతకాల లేఖతో విజయ్ గవర్నర్‌ను కలిశారు. దీనిని సమగ్ర రీతిలో పరిశీలించిన తరువాత గవర్నర్ ప్రభుత్వ స్థాపనకు స మ్మతించారని వెల్లడైంది. దీనితో తమిళ తెలుగు సినిమాలో సస్పెన్స్ భరిత ఘట్టాల మాదిరిగా సాగిన తమిళనాడు ఎన్నికల అనంతర రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. చెన్నైలోనే తిష్టవేసుకుని ఉన్న దూర ప్రాంతాల విజయ్ ఫ్యాన్స్ , సిని ప్రముఖు లు, రాజకీయ దిగ్గజాల సమక్షంలో ఆదివారం విజయ్ సార ధ్య టివికె ప్రభుత్వం ఏర్పాటు కానుంది. చాలా రోజుల ముందే ఐదుగురు ఎమ్మెల్యే ల బలం ఉన్న కాంగ్రెస్ టివికెకు మద్దతు ప్రకటించింది. తరువాతి క్రమంలో జాతీయ స్థాయిలో సమావేశాలు తరువాత సిపిఐ, సిపిఎంలు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చాయి.
మద్దతు లేఖల తరువాతే అర్లేకర్ అనుమతి
కాగా ఇప్పటివరకూ సస్పెన్స్‌గా ఉంటూ వచ్చిన సివికె పార్టీ నుంచి కూడా శనివారం సాయంత్రానికి మద్దతు లేఖలు అందాయి. దీనితో తగు బలం సంతరించుకున్న విజయ్ రాజ్‌భవన్‌కు వెళ్లి అక్కడ గవర్నర్ సమ్మతి పొందినట్లు వెల్లడైంది. దీనితో ఇంతవరకూ ఊగిసలాటగా సాగిన విజయ్ ప్రభుత్వ స్థాపనకు మార్గం సుగమం అయింది. రెండు కీలక ద్రవిడ దిగ్గజ పార్టీల ఇన్నేళ్ల పాలనకు తెర దించుతూ విజయ్ తన సొంత పార్టీతో ఎన్నికల్లో రంగంలోకి దిగారు. అయితే ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన 118 స్థానాలు సంపాదించలేకపోయారు. ఆయన మెజార్టీ 108 వద్దనే నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇతర పార్టీలను ఒప్పించి గవర్నర్ ఆమోదం పొందేలా చేయడానికి ఆయనకు రెండు మూడు రోజుల సమయం పట్టింది.
స్థానిక నెహ్రూ స్టేడియంలో ఉదయం పది గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 234. ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన బలం సరిగ్గా చూపడం జరిగితేనే ప్రభుత్వ స్థాపనకు వీలుంటుందని గవర్నర్ తేల్చిచెపుతూ వచ్చారు. టివికె ప్రభుత్వ స్థాపనకు తమ నుంచి బేషరతు మద్దతు ఉంటుందని అంతకు ముందు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇప్పుడు విసికె, మరో వైపు ఐయుఎంఎల్ తెలియచేశాయి. ఈ దశలో టివికె ప్రభుత్వ స్థాపనకు బలం 121కి చేరింది ఈ క్రమంలో తమిళనాడులో ఇప్పుడు టివికె సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
టివికెకు మద్దతు బలాల సంఖ్య
టివికె 108, కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, విసికె 2, ఐయుఎంఎల్ 2 ఈ విధంగా బలం 121 కి చేరుకుంది. ఇందులో విజయ్ ఎమ్మెల్యే అయిన రెండు స్థానాలు కూడా ఉన్నాయి.
59 ఏండ్ల తరువాత తొలి ద్రవిడేతర నేత సిఎం
పార్టీల మద్దతు లేఖలు ప్రభుత్వ స్థాపనకు కీలకం అయ్యాయి. 59 సంవత్సరాల తరువాత తమిళనాడుకు తొలి ద్రవిడేతర నేత సిఎం కానున్నారు. పైగా సినీ నేపథ్యం ఉన్న నేత సిఎం కావడం మరో ఆకర్షణగా మారింది. మంత్రివర్గ ఏర్పాటుకు అనుమతి దక్కినా ఇప్పుడు మంత్రి మండలిలోకి ఇతర పార్టీల వారిని తీసుకోవల్సి ఉంటుందా? వారికి ఎటువంటి పదవులు ఇవ్వాల్సి ఉంటుందనేది విజయ్ పార్టీ ముందున్న కీలక అంశం అయింది. శనివారం రాత్రి ఈ విషయం ఖరారు అవుతుందని వెల్లడైంది. ఈసారి విజయ్ ఖచ్చితంగా సిఎం అవుతున్నారనే వార్త తెలియడంతో శనివారం రాత్రి విజయ్ నివాసం వద్ద, పార్టీ కార్యాలయం వద్ద ఆయన అభిమానులు కేరింతలతో , విజిల్స్‌తో సంబరాలకు దిగారు.
అయితే తాము విజయ్ పార్టీకి వెలుపలి నుంచే మద్దతు ఇస్తామని సిపిఐ, సిపిఎంలు ప్రకటించాయి. మంత్రి పదవులు తీసుకోవడం లేదన్నారు. విచిత్ర పరిణామంగా వామపక్షాలు, విసికె ఇప్పటికీ డిఎంకె సారధ్య కూటమిలోనే ఉన్నాయి. పైగా డిఎంకెతో తెగతెంపులకు దిగేది లేదని ప్రకటించాయి. స్టాలిన్ కూడా ఆయా పార్టీలు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదు. అయితే కాంగ్రెస్ తమకు వెన్నుపోటు అయిందని మండిపడుతున్నారు. ప్రభుత్వ స్థాపనకు విజయ్‌కు గవర్నర్ సమ్మతి పిలుపు తో ఇప్పుడు టివికె ఎమ్మెల్యేలకు భద్రత పెంచారు. చెన్నై సమీపంలో ఓ ప్రాంతంలోని రిసార్ట్‌లో టివికె ఎమ్మెల్యేలను ఉంచారు. రిసార్ట్ బయట భద్రతను పెంచారని వెల్లడైంది.














