
నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం అత్యంత వివాదాస్పదమైంది. ప్రజాస్వామ్యంలో ఏదైనా అత్యున్నత పాలనా స్థాయినుంచి ఏదైనా మాట్లాడితే తక్షణం అది జనంలో వెంటనే ప్రచారమవుతుంది. అదే ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడితే అది కేవలం కమ్యూనికేషన్‌కు పరిమితం కాదు. అది రాజకీయ నీతిజ్ఞతగా పరిగణించబడుతుంది. ప్రధాని కార్యాలయం ఒక పార్టీకి చెందినదిగా ఉండదు. అది రాజ్యాంగ విలువలకు, కొన్ని కోట్ల ప్రజల సమన్వయ సంకల్పం, ఆకాంక్షల ప్రతిరూపం. అందువల్ల నేరుగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడాలనుకున్న అంశం, కథనం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకునేలా ఉండాలి. కొన్ని కోట్లమంది ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేసే ప్రసంగం జాతీయ ప్రాధాన్యమైనదిగా ఉండాలే తప్ప కేవలం ఒక పార్టీ ఫక్తు రాజకీయ ప్రసంగంలా ఉండరాదు. వాస్తవానికి జాతీయ ప్రాధాన్యత కలిగిన సందర్భాల్లోనే ప్రధాని ఎవరైనా జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ప్రజాస్వామ్య సంప్రదాయం.
యుద్ధాల బీభత్సంలో, ప్రకృతి వైపరీత్యాలు, కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిబ్బరం కలిగించడానికి ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించడం పరిపాటిగా వస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజున అప్పటి మొదటి ప్రధాని జవహర్‌లాల్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 1971లో యుద్ధం కాలంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో మన్మోహన్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి తలెత్తినప్పుడు ప్రధాని మోడీ దేశప్రజలను హెచ్చరిస్తూ ప్రసంగించారు. ఇదంతా సమాచారం అందించడం, ధైర్యం చెప్పడమే కాకుండా కష్టకాలంలో ప్రజలంతా సమైక్యంగా నిలిచి ఉండాలని ప్రబోధించడమే అవుతుంది. జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాలు ఈ విధంగా ఉండాలని విధానాలు ఎక్కడా రాసి పెట్టకపోయినా, దేశంపట్ల నిబద్ధతను స్పష్టం చేయడానికే అని అర్థం చేసుకోవాలి. పార్టీ రాజకీయాలకు అతీతంగా పౌరులను పౌరులుగానే ఉద్దేశించాలి తప్ప కేవలం ఓటర్లుగా చూడరాదు.
ప్రజల్లో చీలికలు తెచ్చేవిగా లేదా ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఉండరాదు. కానీ దురదృష్టవశాత్తు ప్రధాని మోడీ జాతీయ టివిలో చేసిన ప్రసంగం మొత్తం విపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు ప్రతిధ్వనించింది. జాతిని ఉద్దేశించిన దానికి, రాజకీయ ఉపన్యాసానికి మధ్య ఉన్న తేడా మసకబారింది. యావత్ ప్రజాశ్రేయస్సు కోరని ప్రసంగాలను జాతిని ఉద్దేశించి ప్రధాని చేయవచ్చా? కేవలం విపక్షాలపై దుమ్మెత్తి పోయడానికా? ఇదివరకెవరైనా ప్రధానులు ఈ విధంగా ప్రసంగించేరా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ప్రధాన మంత్రి కూడా ఒక రాజకీయ నాయకుడే. ఆయన తన పార్టీకి అధినేతగా నాయకత్వం వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ప్రతికూల రాజకీయాలను ఎదుర్కొంటారు. అదంతా ఎన్నికల వరకే తప్ప ప్రధాని స్థానంలో పాలిస్తున్నప్పుడు కాదు. సర్వేజనా సుఖినోభవంతు అన్న ధ్యేయమే కనిపించాలి. ప్రధాని ప్రసంగాల కోసం ఉపయోగించే ప్రసార మార్గాలు దూరదర్శన్ లేదా ఆల్ ఇండియా రేడియో అధికార పార్టీ స్వంత ఆస్తులు కావు. అవి ప్రజలందరికీ చెందిన ప్రజావనరులు. దేశం మొత్తంమీద యావత్ జాతికి నిష్పక్షపాతంగా వినియోగం కావలసిందే.
ముఖ్యంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు ఇలాంటి ప్రసంగాల ప్రసారాలను ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా పరిశీలించి, నియంత్రించడం అవసరం. ఈ అధికారం, బాధ్యత ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయం. ప్రధాని ప్రసంగాన్ని నియంత్రించే చట్టపరమైన నిబంధనలు ఎన్నికల కమిషన్ వద్ద లేనంత మాత్రాన కమిషన్ అధికారం లేనిది కాదు. ఆయా ప్రసంగాల తీరుపై వివరణ కోరుతూ మార్గదర్శకాలు జారీ చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది. ఎన్నికల నిష్పక్షపాతాన్ని నిర్ధారించడానికి, భవిష్యత్ మార్గదర్శకాలను నిర్దేశించగలిగే వీలుంటుంది. అలాగే అధికార ప్రసంగానికి, రాజకీయ ప్రసంగాలకు మధ్యగల స్పష్టమైన వ్యత్యాసాలను నిబంధనల్లో పేర్కొనవచ్చు. ఎన్నికల సమయంలో నిబంధనలను నిర్ధారించడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ (ప్రసారభారతి) వంటి వేదికలను ఎన్నికల ప్రయోజనాల కోసం వినియోగించరాదని, కచ్చితంగా ఆదేశించవచ్చు. ఈ ఆదేశాలు ఎవరి స్వేచ్ఛా ప్రసంగాలకు ఆటంకాలు కావు. ప్రజాస్వామ్య పారదర్శకతకు రక్షణ కవచాలు. ఈ అంశం ఏ వ్యక్తి గురించి, పార్టీ గురించి కాదు. ప్రజాస్వామ్య సమున్నత విలువలను పరిరక్షించడానికి.
ప్రధాని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాలు ప్రజలను కలుపుకుని ముందుకు నడిపించినట్టు బాధ్యతాయుతమైన సూచనలుగా కనిపించాలి. భారతదేశం వంటి వైవిధ్యమైన, చైతన్యవంతమైన, దేశంలో రాజకీయ పోటీ అనివార్యమైనా, అది ఆరోగ్యకరమైన పద్ధతిగానే ఉండాలి తప్ప పక్షపాత ధోరణులకు, ఈర్షాద్వేషాలకు, అబద్ధాలతో అల్లకల్లోలం సృష్టించే పరిణామాలుగా మారకూడదు. దేశం మొత్తానికి అన్వయించే కొన్ని సందర్భాల్లో జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాలు కూడా ఒక ఘట్టమే. దీన్ని పక్షపాత రాజకీయ కథనం స్థాయికి దిగజార్చడం అంటే ప్రధాని వంటి అత్యున్నత పదవినే కాదు, నిష్పక్షపాత ప్రజాస్వామ్య విలువలను తగ్గించడమే అవుతుంది.











