
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నడూ దాడులను ప్రోత్సహించదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అయితే బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని హెచ్చరించారు. అరాచకాలు, దాడులకు కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్సే అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేయాలనే ఆలోచనే కార్యకర్తలకు లేదని, క్యాంప్ ఆఫీస్ సర్కార్ నిధులతో నిర్మించిందని అన్నారు. -సికింద్రాబాద్ సురభి గార్డెన్స్ వద్ద గురువారం మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి పట్ల స్పందించారు. అక్కడ బూతులు తిడుతూ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టా?, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ అరాచకాలు గుర్తులేవా? అని మండిపడ్డారు.
కేటీఆర్ సిరిసిల్ల వచ్చినప్పుడల్లా బీజేపీ కార్యకర్తలను పెట్టిన హింస గుర్తుకు రాలేదా?, ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ కార్యకర్తలపై చేసిన రాళ్ల దాడులను మర్చిపోతామా? అని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్లినప్పుడు ఉమ్మడి నల్లగొండలో మాపై కర్రలతో, రాళ్లతో చేసిన దాడులు గుర్తు లేవా?, మహిళా కార్యకర్తలను, రైతులను ఎత్తుకుపోయిన బీఆర్‌ఎస్ గూండాలు చేసిన దాడులను మర్చిపోతామా? అని బిఆర్‌ఎస్‌పై ఎదురు దాడి చేశారు. ఈ రోజు సిగ్గులేకుండా బూతులు తిడితే ఊరుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దాడుల చేసి ఇప్పుడు సుద్దపూస లెక్క మాట్లాడితే సరిపోతుందా? అని అన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, హద్దుల్లో ఉంటూ హుందాగా వ్యవహరిస్తే మంచిదని బండి హితవు పలికారు.














