
ఎపిలోని కోనసీమ జిల్లాలో పెళ్లి విందు విషాదాన్ని నింపింది. జిల్లాలోని కొత్తపేట మండలం రామ్మోహన్ రావుపేట లో వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన భోజనాలు తిన్న అతిథులు ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 28 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. బాధితుల్లో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉండటంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బాధితుల పరిస్థితిని గమనించిన బంధువులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్య సిబ్బంది రంగంలోకి దిగి బాధితులకు అత్యవసర చికిత్స అందించారు.
ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కలుషిత ఆహారం లేదా నీటి వల్ల ఈ సమస్య తలెత్తి ఉంటుందని అనుమానిస్తున్నారు. కలుషిత ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించారు. అధికారు లతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసర మైతే స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేయించాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.













